తమిళనాడులోని కొయంబత్తూరు సిటీ తొలి మహిళా బస్సు డ్రైవర్ అయిన షర్మిల గాంధీపురం నుంచి సోమనూర్ రూట్లో ఓ ప్రైవేట్ బస్సుకు డ్రైవర్‌గా పనిచేస్తోంది. ఎంతో నైపుణ్యంతో బస్సు నడుపుతూ అందరి ప్రశంసలు పొందుతోంది. ఈ నేపథ్యంలో షర్మిల నడుపుతున్న బస్సులో డీఎంకే ఎంపీ కనిమొళి శుక్రవారం ప్రయాణించారు. అనంతరం ఆ యువతి డ్రైవింగ్ నైపుణ్యాన్ని, ధైర్యాన్ని మెచ్చుకున్నారు.
ప్రైవేట్ బస్సు డ్రైవర్ అయిన తండ్రి సమక్షంలో షర్మిలను ఎంపీ కనిమొళి సత్కరించారు. చేతి వాచీని ఆమెకు బహుకరించారు. ఈ సంఘటన జరిగిన కొన్ని గంటల తర్వాత ఉద్యోగం నుంచి తనను తొలగించారని మహిళా బస్సు డ్రైవర్ షర్మిల ఆరోపించింది. ఎంపీ కనిమొళి బస్సులో ప్రయాణించిన సందర్భంగా ఆమె పట్ల ఒక మహిళ దురుసుగా ప్రవర్తించగా అడ్డుకోని కండక్టర్‌పై బస్సు యజమానికి ఫిర్యాదు చేసినట్లు తెలిపింది. అయితే సొంత పబ్లిసిటీ కోసం ప్రముఖ వ్యక్తులను బస్సులోకి ఎక్కిస్తున్నట్లు యజమాని తనను తిట్టినట్లు చెప్పింది.
అలాగే ఉద్యోగం నుంచి వెళ్లిపొమ్మని చెప్పారని, బస్సు మేనేజర్ కూడా తన తండ్రి పట్ల అసభ్యంగా మాట్లడినట్లు షర్మిల ఆరోపించింది. ఈ వివాదంపై తాజాగా ప్రముఖ నటుడు, మక్కల్ నీది మయ్యమ్ చీఫ్ కమల్ హాసన్ స్పందించారు. ఉద్యోగం కోల్పోయిన ఆ మహిళా డ్రైవర్ కు కారును బహుమతిగా ఇస్తున్నట్లు ప్రకటించారు.కొయంబత్తూర్ తొలి మహిళా బస్సు డ్రైవర్ షర్మిల అంశం తననెంతో బాధించిందని కమల్ హాసన్ తెలిపారు. ‘ఎంతో మంది మహిళలకు షర్మిల స్ఫూర్తిగా నిలిచారు. ఆమె కేవలం డ్రైవర్ గానే మిగిలిపోకూడదు. ఎంతో మంది షర్మిలలను సృష్టించాలి. అందుకే కమల్ కల్చరల్ సెంటర్ తరఫున షర్మిలకు కారును అందజేస్తున్నాం. ఈ కారును క్యాబ్ కేవలకు వినియోగించుకొని ఎంతో మందికి ఉపాధి కల్పించాలి. త్వరలోనే ఆమె పారిశ్రామికవేత్తగా ఎదగాలని ఆశిస్తున్నా’ అని కమల్ హాసన్ అన్నారు.
Coimbatore's first woman bus driver #Sharmila who quit her job after a controversy erupted over issuing a ticket to DMK MP Kanimozhi, has been gifted with a brand new car by MNM leader #KamalHaasan 👌 nice gesture! pic.twitter.com/vJxRlHH0Ie
— Siddarth Srinivas (@sidhuwrites) June 26, 2023