తెలంగాణకు మరో భారీ పెట్టుబడి రానున్నది. బ్రిటన్‌కు చెందిన ఆర్థిక సేవల దిగ్గజం లాయిడ్స్ బ్యాంకింగ్ గ్రూప్.. హైదరాబాద్‌లో తమ నూతన టెక్నాలజీ సెంటర్‌ను ప్రారంభించబోతున్నది.
గతనెల బ్రిటన్ పర్యటనలో రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కే తారకరామారావుతో సమావేశం జరిగిన నేపథ్యంలో 5 వారాల్లోనే పెట్టుబడి పెట్టేందుకు లాయిడ్స్ నిర్ణయం తీసుకోవడం గమనార్హం. రాబోయే మూడేండ్లకుపైగా కాలంలో డిజిటల్ సేవలను విస్తరించేందుకు గ్రూప్ పెట్టుకున్న 3 బిలియన్ బ్రిటీష్ పౌండ్ల వ్యూహాత్మక పెట్టుబడి లక్ష్యంలో భాగంగానే ఈ టెక్నాలజీ సెంటర్ వస్తున్నది. ప్రస్తుతం కంపెనీకి డిజిటల్లీ యాక్టీవ్ యూజర్లు 2 కోట్లకుపైగానే ఉన్నారు.
కాగా, రాష్ట్రంలో వ్యాపార అనుకూలతలతోపాటు అత్యంత నైపుణ్యం కలిగిన మానవ వనరులు అందుబాటులో ఉండటంతోనే హైదరాబాద్‌లో టెక్నాలజీ సెంటర్‌ను ప్రారంభిస్తున్నామని లాయిడ్స్ బ్యాంకింగ్ గ్రూప్ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ రోన్ వాన్ కెమెనేడ్ తెలిపారు. టెక్నాలజీ సెంటర్ ఏర్పాటుకు అవసరమైన ఉద్యోగుల నియామక ప్రక్రియను ప్రారంభించామన్నారు. సాంకేతిక, ఇన్నోవేషన్ రంగాల్లో గొప్పగా ఎదుగుతున్న హైదరాబాద్‌లో టెక్నాలజీ సెంటర్ ఏర్పాటుతో ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఖాతాదారులకు దీర్ఘకాలంపాటు సుస్థిరమైన సేవలు అందించేందుకు వీలు కలుగుతుందన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశారు.