తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలలో భాగంగా ఈరోజు నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ లో నిర్వహించిన ‘తెలంగాణ పట్టణ ప్రగతి దినోత్సవ’ వేడుకలు ఘనంగా జరిగాయి. ప్రగతి నగర్ పుచ్చలపల్లి సుందరయ్య ఫంక్షన్ హాల్ లో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే కేపి వివేకానంద్ గారు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.
ఈ సందర్భంగా స్థానిక మేయర్ కొలన్ నీలా గోపాల్ రెడ్డి గారు, కమిషనర్ రామకృష్ణ రావు గారితో కలిసి నిజాంపేట్ నగర్ పాలక సంస్థ చేపట్టిన అనేక అభివృద్ధి కార్యక్రమాల ప్రగతి నివేదికను ఎమ్మెల్యే గారు ఆవిష్కరించారు. నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ ఏర్పడిన నాటి నుండి కార్పొరేషన్ పరిధిలో జరిగిన అభివృద్ధి కార్యక్రమాలు నాడు – నేడు పేరిట రూపొందించిన ప్రత్యేక ఏవీని వీక్షించారు. అనంతరం కార్పోరేషన్ పరిధిలో ఉత్తమ సేవలు అందిస్తున్న ప్రజా ప్రతినిధులకు, వివిధ రంగాల్లో, పలు విభాగాలలో ఉత్తమ ప్రతిభ కనబర్చిన అధికారులకు సర్టిఫికెట్లు, మోమెంటోలు ఎమ్మెల్యే గారి చేతుల మీదుగా అందజేశారు.
పారిశుద్ధ్య కార్మికుల సేవలకు గుర్తింపుగా “సఫాయి అన్న.. సలాం” “సఫాయి అమ్మ.. సలాం” అనే నినాదంతో వారిని ఘనంగా సన్మానించి మోమెంటోలు అందజేశారు. ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ.. నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ అన్ని రంగాల్లో అభివృద్ధి దిశగా దూసుకుపోతుందన్నారు. కొత్తగా ఏర్పాటైన మున్సిపల్ కార్పొరేషన్ అయినా అతి తక్కువ కాలంలోనే అనేక రంగాల్లో అభివృద్ధి సాధించడం, జాతీయ స్థాయిలో సైతం అవార్డును దక్కించుకోవడం సంతోషించ దగ్గ విషయం అన్నారు. ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపరిచే దిశగా ప్రభుత్వం పని చేస్తుందన్నారు. ప్రజా ప్రతినిధులంతా నిత్యం ప్రజల్లోనే ఉంటూ రాబోయే రోజుల్లో మరిన్ని సేవలందించాలన్నారు. గౌరవ పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ గారి సహకారంతో నిజాంపేట్ ను మోడల్ కార్పొరేషన్ గా తీర్చిదిద్దుతామన్నారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు, కోఆప్షన్ సభ్యులు, అధికార సిబ్బంది, నాయకులు పాల్గొన్నారు.