ఇతర పార్టీల నేతలను బీజేపీలోకి తీసుకొని రావడం ఇక తన వల్ల కాదని ఆ పార్టీ చేరికల కమిటీ చైర్మన్, ఎమ్మెల్యే ఈటల రాజేందర్ అన్నట్టు తెలిసింది.బీఆర్ఎస్ బహిష్కృత నేతలు పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, జూపల్లి కృష్ణారావు ఎంత ప్రయత్నించినా బీజేపీలోకి రావడం లేదని వ్యాఖ్యానించినట్టు సమాచారం. పైగా తననే బీజేపీ విడిచి బయటకు రావాలంటూ ఆఫరిస్తున్నారని పేరొన్నట్టు తెలిసింది.
సోమవారం హైదరాబాద్‌లోని ఓ హోటల్లో ఈటల ఈ వ్యాఖ్యలు చేసినట్టు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. జూపల్లిని, పొంగులేటిని పలుమార్లు కలిసినా.. ప్రస్తుతం బీజేపీలో చేరేందుకు అంగీకరించడం లేదని చెప్పినట్టు సమాచారం.
వాస్తవానికి జూపల్లి, పొంగులేటి కొంతకాలంగా బీజేపీ, కాంగ్రెస్‌తో దోబూచులాడుతున్నారు. చర్చల పేరుతో రెండు పార్టీల నాయకులను తమ చుట్టూ తిప్పించుకుంటున్నారు. ఈటల నేతృత్వంలో జరుగుతున్న చర్చలు చేరికల కోసం కాదని, ఈటల, కొండా విశ్వేశ్వర్‌రెడ్డి వంటి బీజేపీ అసంతృప్త నేతలు, పొంగులేటి, జూపల్లి వంటి ఇతర నేతలు కలిసి కొత్త పార్టీ పెట్టేందుకు వ్యూహాలు రచిస్తున్నారని గుసగుసలు వినిపించాయి.