Home / SLIDER / ధరణి లేకుంటే దారుణమే

ధరణి లేకుంటే దారుణమే

‘కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి రాగానే ధరణి పోర్టల్‌ను బంగాళాఖాతంలో కలిపేస్తాం’ సీఎల్పీ నేత భట్టివిక్రమార్క చేసిన వ్యాఖ్య ఇది. మొన్న పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌ కూడా ఇట్లాగే మాట్లాడారు. కాంగ్రెస్‌కు ఎందుకు ధరణిపై కక్ష?.ఇంతకుముందు కాంగ్రెస్‌ హయాంలో పేద రైతుల భూ రికార్డులు పట్వారీలు, వీఆర్‌ఏలు, వీఆర్వోలు, గిర్దావర్లు, తహసిల్‌దార్ల ఇండ్లల్ల ఉంటుండె. ఇప్పుడవి రైతు కంటిచూపు పరిధిలో ఉన్నయి. కంప్యూటర్‌ మౌస్‌ క్లిక్‌ చేస్తే చాలు, ఫోన్‌ మీద ఒక్క బటన్‌ నొక్కితే చాలు.. పొలం రికార్డులు ఎప్పుడుపడితే అప్పుడు ప్రపంచంలో ఏ మూలన ఉన్నా చూసుకోవచ్చు. ధరణిని తీసేసి, రైతుల్ని పాత పాడు కాలంలోకి పంపిస్తారా?

ఇదివరకు ఒక అధికారికో, ఒక పట్వారికో, ఒక తహసీల్దారుకో.. ఎవరికి కోపం వచ్చినా రైతు జాగ గల్లంతే! తాతలనాటి భూమి అయినా పత్తా లేకుండా పోయేటిది! పంటపొలాలు అకస్మాత్తుగా కాలువ భూములయ్యేవి! భూమి పత్రాలమీద పేరే మాయమయ్యేది! మాయమైన సంగతి రైతుకు తెలిసే సరికే పుణ్యకాలం పూర్తయ్యేది. ఇప్పుడు రైతు తన భూమి తన పేరు మీద ఉందా లేదా తెలుసుకోవాలంటే ఎవరినో అడగాల్సిన అవసరం లేదు. ఏండ్లకేండ్లు తిరగాల్సిన పని అంతకంటే లేదు. ధరణిని తీసేసి అధికారులు ఇష్టారాజ్యంగా పట్టాదారులను మార్చిపారేసే కాంగ్రెస్‌ కాలపు ఆరాచక పద్ధతి తెస్తారా? ఇది ఎందుకోసం? ఇది ఎవరి లబ్ధికోసం?

మన చూపుడువేలు కొసతో మన భూమిని కొలిచే ధరణిపోతే ఎవరికి నష్టం?
అధికారుల సంతకంతో పట్టాలు మారిపోయే రెవెన్యూ రికార్డు కావాలా?
రైతు సంతకం, వేలిముద్రలు ఉంటే తప్ప అక్షరం మార్చలేని ధరణి రికార్డు కావాలా?
ఆ మాం బాపతు అధికారులు, వైట్‌నర్లు వాడి మార్చి పారేసే రెవెన్యూ రికార్డు ఉండాలా?
ఆన్‌లైన్‌లో సుభద్రంగా ఉండే అత్యాధునిక డిజిటల్‌ ధరణి రికార్డు ఉండాలా?
అధికారుల చుట్టూ రోజుల తరబడి తిరిగితే తప్ప దొరకని రెవెన్యూ రికార్డు కావాలా?
ఎప్పుడంటే అప్పుడు, ఏ రాత్రంటే ఆ రాత్రి ఎవరికి వారే చూసుకునే ధరణి రికార్డు కావాలా?

తెలంగాణలో వ్యవసాయాన్ని నిలబెట్టే మహత్తర కృషిలో ఒక అడుగు ధరణి. నిరుపేద, నిరక్షరాస్య రైతాంగానికి తన భూమిపై పూర్తి సాధికారకమైన, చట్టబద్ధమైన భద్రత, భరోసా కల్పించే ప్రయత్నమిది. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని రైతు మేలుకోసం వాడిన విజ్ఞానమిది.

అది 2016-2018 మధ్యకాలం.. నల్లగొండ జిల్లా చందంపేటలో వెలుగులోకి వచ్చిన నకిలీ పాస్‌పుస్తకాల కుంభకోణం రాష్ట్రవ్యాప్తంగా సంచలనానికి కారణమైంది. ఆర్డీవో కార్యాలయంలో గుట్టలుగా పడి ఉన్న కొత్త పాస్‌పుస్తకాలను చందంపేట ఎమ్మార్వో, మరికొందరు అధికారులు కలిసి మాయం చేశారు. వాటికి ఫొటోలు అతికించి, ఇష్టమొచ్చిన సర్వే నంబర్లు రాసుకున్నారు. లంచాలు తీసుకుని 13,959 ఎకరాల ఎకరాల అడవికి పట్టాలు పుట్టించారు. ఆ రికార్డులను పహాణీల్లోకి ఎక్కించి, అధికారిక పట్టాలుగా వాటిని మార్చేశారు. వాటికి రైతుబంధు కోసం దరఖాస్తు కూడా చేసుకున్నారు. ధరణి రాకతో వారి ఆట ఆగింది. ప్రభుత్వ ఆదేశాలతో ఏసీబీ అధికారులు లోతుగా దర్యాప్తు చేయడంతో 14వేల ఎకరాల భూ కుంభకోణం బయటపడింది. భూముల రికార్డుల నిర్వహణ గ్రామ, మండలస్థాయి అధికారుల చేతుల్లో ఉంటే జరిగే అవినీతి విశ్వరూపానికి ఇది ఒక ఉదాహరణ మాత్రమే. కాంగ్రెస్‌ నేతలు చెప్తున్నట్టు ఈ పద్ధతే బాగున్నదా? మన భూమిపై ఎవడో పట్టాలు తయారు చేసుకునే పద్ధతినా కాంగ్రెస్‌ నేతలు కోరుకునేది? ఈ భూపందేరం, ఈ ఇష్టారాజ్యమే బాగున్నదా?

ఊరూరా అక్రమాల పర్వం
—————————————–
పటేల్‌ పట్వారీ వ్యవస్థ ఉన్న సమయంలో భూముల రికార్డులు, రైతుల తలరాతలు ఎంత సులభంగా మారిపోయేవో గ్రామాల్లోని వృద్ధులకు అనుభవంలో ఉన్నవే. గతంలో పహాణీ రికార్డులు వీఆర్వోల ఇండ్లల్లో ఉండేవి. దీంతో రికార్డుల్లో మార్పులు, చేర్పుల్లో గ్రామ రెవెన్యూ అధికారిదే ఇష్టారాజ్యం.

పట్టాదారు కాలమ్‌లో ఎవరి పేరును రాస్తే వాళ్లకే హక్కులు సంక్రమించేవి. ఇద్దరి మధ్య వివాదం ఉంటే.. ఒకరి వద్ద లంచం తీసుకొని వాళ్ల పేర్లమీద ఆ భూమిని రాసిన ఉదంతాలెన్నో. అధికారంలో ఉన్నవారు, కాస్త పలుకుబడి ఉన్నవారు చెప్పినట్టల్లా రికార్డుల్లో పేర్లు మారిపోయేవి. వైట్‌నర్‌ పెట్టి రైతుల పేర్లు, విస్తీర్ణం మారిపోయిన సందర్భాలు కోకొల్లలు. ఇక అడిగినంత డబ్బు ఇవ్వలేదనో, తనను ఎదిరించి మాట్లాడారనో, గౌరవం ఇవ్వలేదనో.. చిన్న చిన్న కారణాలకే సర్వే నంబర్లు మాయం అయ్యేవి, పంట పొలాలు అకస్మాత్తుగా కాలువ భూములుగానో, ప్రభుత్వ భూములుగానో మారిపోయేవి. అనుభవదారు కాస్తా యజమాని అయ్యేవారు. ప్రభుత్వ భూములు ప్రైవేట్‌ వ్యక్తులపరం అయ్యేవి. దేవుడి పేరన ఉన్న భూములు మనుషుల పేర్లపైకి బదలాయించడబడేవి. సర్వే నంబర్‌ ఊరు మధ్య నుంచి శివారుకు వెళ్లిపోయేది.

రైతు తన భూమిని అమ్ముకోవడానికో, కుదువ పెట్టడానికో ప్రయత్నించినప్పుడు భూమి తన పేరుమీద లేదనే విషయం బయటపడేది. ఇక అప్పటి నుంచి అష్టకష్టాలు మొదలు. ఎమ్మార్వో నుంచి సీసీఎల్‌ఏ వరకు, కింది కోర్టు నుంచి సుప్రీంకోర్టు వరకు తరాలపాటు తిరగాల్సి వచ్చేది. ‘మళ్లీ నా పేరుమీదికి మార్చండి మహాప్రభో..’ అంటూ గ్రామస్థాయి నుంచి రెవెన్యూ అధికారులకు దండాలు పెడుతూ, ఆఫీసులచుట్టూ ప్రదక్షిణలు చేయాల్సి వచ్చేది.

చెప్పులరిగేలా తిరిగినా, కాళ్లమీద పడ్డా కనీస ఫలితం ఉండేది కాదు. సర్వేనంబర్‌లోని విస్తీర్ణంతో సంబంధం లేకుండా, తనకు కావాల్సిన వాళ్లపేర్లతో బై నంబర్లు వేసి, ‘కాగితపు’ భూములను సృష్టించినవారు ఎందరో ఉన్నారు. ఇలా రాష్ట్రంలో వాస్తవంగా ఉన్న భూమికి, రికార్డుల్లో ఉన్న భూమికి మధ్య వేలాది ఎకరాల వ్యత్యాసం ఉన్నది. పేద, నిరక్ష్యరాస్యులైన రైతులకు ఈ విషయం తెలిసేదే కాదు. కాంగ్రెస్‌ నేతలు అద్భుతమని చెప్తున్న పాత రోత రాతపద్ధతి సృష్టించిన అరాచకమిది! ధరణిని బంగాళాఖాతంలో పడేసి ఇలాంటి అవకతవకల పద్ధతిని తిరిగి రైతు నెత్తిన రుద్దుతరా?

పహాణీల ప్రహసనం.. అక్రమాలు అనంతం
———————————————
భూమి హక్కులకు సంబంధించి తెలంగాణ ప్రాంతంలో ప్రధానమైన రికార్డులు రెండు. ఒకటి పహాణీ, రెండోది సేత్వార్‌. సేత్వార్‌ అనేది సెటిల్మెంట్‌ రికార్డ్స్‌. దీన్నే ఆర్‌ఎస్‌ఆర్‌ అని కూడా అంటారు. తెలంగాణ ప్రాంతంలో 1940 దశకంలో భూముల సమగ్ర సర్వే జరిగింది. ఆ సమయంలో ఏయే భూములు ఎవరి పేరుమీద ఉన్నాయి? ప్రభుత్వ భూములు, దేవాదాయ భూములు.. ఇలా క్యాటగిరీల వారీగా సమగ్ర వివరాలతో రికార్డును రూపొందించారు. రాష్ట్రంలోని భూముల వివరాలకు ఇదే ప్రామాణికం. దీనిని మార్చడం అసాధ్యం. రెండోది పహాణీ.. ఇది అందరికీ తెలిసిందే. ప్రతి గ్రామంలో ఉండే రెవెన్యూ రికార్డు. ఇందులో సర్వే నంబర్లు, బై నంబర్ల వారీగా భూములు ఎవరి పేరుమీద ఉన్నాయి? హక్కుదారులు ఎవరు? అనుభవదారులు ఎవరు? ఎన్ని సంవత్సరాలుగా సాగు చేసుకుంటున్నారు? వంటి వివరాలన్నీ ఉంటాయి. ప్రతి సంవత్సరం గ్రామ రెవెన్యూ అధికారి (వీఆర్వో) ఈ రికార్డును అప్‌డేట్‌ చేయాల్సి ఉంటుంది. ఆ సంవత్సర కాలంలో భూముల లావాదేవీలు ఏవైనా మారితే యజమానుల పేర్లు మారుస్తారు.

కాలమ్‌ నంబర్‌ 2లో సర్వే నంబర్‌, 3లో విస్తీర్ణం, 6లో భూమి రకం, 12లో పట్టాదారు పేరు, 13లో అనుభవదారు పేరు, 14లో అనుభవదారు విస్తీర్ణం వంటివివరాలు ఉండేవి. ఏటా సవరించిన రికార్డులకు మండల అధికారులు ఆమోదముద్ర వేసేవారు. వాటి ఆధారంగా పట్టాదారు పాస్‌ పుస్తకాలు మంజూరు చేసేవారు. అయితే ఊరి భూ దస్ర్తాలన్నీ ఇండ్లల్ల పెట్టుకున్న రెవెన్యూ అధికారులు ఏది రాస్తే అదే పహాణీ అయ్యింది. ఎవరి పేరు పెడితే వారిదే పట్టా అయ్యింది. అందుకే ధరణిని తెచ్చినప్పుడు అవకతవకలతో కుళ్లిపోయిన వీఆర్వో వ్యవస్థను సీఎం కేసీఆర్‌ రద్దు చేశారు.

ఇప్పుడు మళ్లీ పాత పద్ధతి తెస్తామంటున్న కాంగ్రెస్‌ నేతలు.. కల్లు తాగిస్తేనే, చెయ్యి తడిపితేనో రికార్డులను మార్చేసే వ్యవస్థకు తిరిగి జీవంపోస్తారా? రైతుల ఉసురుపోసుకున్న వ్యవస్థకు తిరిగి కాంగ్రెస్‌ నేతలు ఊపిరిపోస్తారా?

14 శాతం హత్యలు భూ తగాదాల వల్లే..
———————————————–
‘మీకు ఆంధ్రప్రదేశ్‌లో వ్యవసాయ భూమి ఉంటే.. పట్టాదారు పాస్‌ పుస్తకం ఉంటే సరిపోదు. ప్రతి సంవత్సరం కచ్చితంగా పహాణీ కాపీ తీసుకొని దగ్గర పెట్టుకోండి. సేత్వార్‌ రికార్డును కూడా మీ దగ్గర ఉంచుకోండి. మీ భూమి ఎప్పుడైనా మీది కాకుండా పోవచ్చు’ అని ఉమ్మడిరాష్ట్రంలో భూ నిపుణులు, న్యాయ నిపుణులు సూచించేవారంటే పరిస్థితి ఎంత అధ్వానంగా ఉండేదో అర్థం చేసుకోవచ్చు. గ్రామాల్లోని భూ వివాదాలు మాటలతో ఆగిపోవు. రైతుల మధ్య, కుటుంబాల మధ్య ఘర్షణలు మొదలై, నేరాల వరకు వెళ్లేవి. గతంలో వచ్చిన ఒక నివేదిక ప్రకారం సివిల్‌ కోర్టుల్లోని కేసుల్లో 66శాతం భూ వివాదాలకు సంబంధించినవే ఉన్నాయి. దేశంలో జరుగుతున్న హత్యల్లో 14 శాతం భూ తగాదాల వల్లే జరుగుతున్నాయి. ఇక.. రికార్డులు సరిగా లేక రైతులు ఎకరానికి ఏటా రూ.50వేల వరకు లబ్ధిని కోల్పోతున్నారని పేర్కొన్నాయి. ఇలా భూ తగాదాల వల్ల జాతీయ ఆదాయానికి 1.3 శాతం నష్టం కలుగుతున్నట్టు నివేదికలు వెల్లడించాయి. భూ తగాదాలు రైతు కుటుంబాలను ఆగం చేయడమే కాదు.. పారిశ్రామిక ప్రగతికి, తద్వారా రాష్ట్ర/దేశ అభివృద్ధికి అడ్డంకిగా మారాయి. ధరణి అందుబాటులోకి వచ్చాక.. అందుబాటులోకి వచ్చిన ఆధునిక సాంకేతికతో ప్రతి గజంపైనా స్పష్టత వచ్చింది. ఫలితంగా భూ తగాదాలు చాలావరకు తగ్గిపోయాయి. ధరణి ఉండొద్దని కోరుకుంటున్న కాంగ్రెస్‌ నేతలు.. మళ్లీ పల్లెల్లో భూ తగాదాలు జరుగాలని కోరుకుంటున్నరా? ఊరూరా పంచాయితీలు తెంచుతూ పబ్బం గడుపుకోవాలని చూస్తున్నరా?

రికార్డులు భద్రం.. రైతులకు ధైర్యం
———————————————
భూ సమస్యలపై, రెవెన్యూ యంత్రాంగం అక్రమాలపై ‘నమస్తే తెలంగాణ’ గతంలో ‘ధర్మగంట’ పేరుతో ప్రత్యేక పేజీని నడిపించింది. రాష్ట్రవ్యాప్తంగా వేలాదిమంది భూ బాధితులు తమ గోడును వెల్లబోసుకున్నారు. ఈ దుస్థితిని అర్థం చేసుకున్న సీఎం కేసీఆర్‌ ఈ సమస్యలకు శాశ్వత పరిష్కారంగా ‘ధరణి పోర్టల్‌’కు రూపకల్పన చేశారు.

భూ వివాదాలకు ముగింపు పలకాలంటే రెండే మార్గాలు. మొదటిది.. అసలు సమస్యే రాకుండా చేయడం. రెండోది.. ఒకవేళ సమస్య వచ్చినా సులభంగా పరిష్కారం అయ్యేలా చూడటం. ఇందులో సీఎం కేసీఆర్‌ మొదటిదానికే ఓటేశారు. రికార్డుల ప్రక్షాళన చేపట్టి.. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న భూరికార్డులను ఆన్‌లైన్‌ చేయించారు. రికార్డుల నిర్వహణను కిందిస్థాయి రెవెన్యూ అధికారుల పరిధి నుంచి తొలిగించారు. అవినీతికి మూలమైన వీఆర్వో వ్యవస్థను రద్దు చేశారు. డిజిటల్‌ రికార్డులన్నింటినీ క్రోడీకరించి ‘ధరణి’ పోర్టల్‌ను ఆవిష్కరించారు.

భూమి రికార్డుల నిర్వహణ రైతుల చేతికే ఇచ్చారు. రైతు వేలిముద్ర వేయకుండా భూ లావాదేవీలు జరిపే అవకాశమే లేకుండా చేశారు. అమ్మినవారు, కొన్నవారి వేలిముద్రలు, ఫొటోలు.. ఇలా ప్రతి లావాదేవీ ఆన్‌లైన్‌లో అత్యంత పారదర్శకంగా జరుగుతున్నది. ఇందులో అధికారులకు ఎలాంటి పాత్ర లేదు. దీంతో భూ వివాదాలకు చెక్‌ పడింది. రైతులు తమ భూముల రికార్డులు భద్రంగా ఉన్నాయని గుండెలమీద చేయి వేసుకొని నిద్రపోతున్నారు. రికార్డుల్లో ఏవైనా మార్పులు జరుగాలన్నా కలెక్టర్‌ స్థాయిలో మాత్రమే సాధ్యమవుతున్నది.

తెల్లారితే భూమి ఉన్నదో, పోయిందో తెలియని రోజుల నుంచి.. ఇప్పుడు ప్రపంచంలో ఏ మూలన ఉన్నా నా భూమి భద్రంగా ఉన్నదనే ధైర్యం వచ్చింది. ఈ భద్రతను మంటగలిపి.. మళ్లీ రైతులను చీకట్లోకి విసిరివేయడమే ప్రతిపక్ష నేతల లక్ష్యంగా ఉన్నది. కాంగ్రెస్‌ నేతలు అద్భుతమని చెప్తున్న పాత రోత రాతపద్ధతి సృష్టించిన అరాచకాన్ని.. ధరణి పుణ్యమా అని తెలంగాణ ఇప్పుడిప్పుడే మరిచిపోతున్నది. మళ్లీ దానిని తీసుకొచ్చి రాష్ట్ర నెత్తిన రుద్దాల్నా? భూవివాదాలను ఎగదోసి పచ్చని పొలాల్లో నెత్తురు పారాల్నా? రైతన్నలూ ఆలోచించండి. ధరణిని బంగాళాఖాతంలోకి విసిరేయాల్నా? ధరణిని బంగాళాఖాతంలో విసిరేయమన్న వాళ్లను బంగాళాఖాతంలోకి విసిరేయాల్నా?

★ సివిల్‌ కోర్టుల్లోని కేసుల్లో భూవివాదాలు 66%

★ దేశంలో జరుగుతున్న హత్యల్లో భూతగాదాల వల్ల జరుగుతున్నవి 14%

★ రికార్డులు సరిగా లేక రైతులు సగటున ఎకరానికి నష్టపోతున్న లబ్ధి రూ.50 వేలు

★ భూ తగాదాల వల్ల జాతీయ ఆదాయానికి వాటిల్లుతున్న నష్టం 1.3%
– నేడు కేసీఆర్‌తో కేజ్రీవాల్‌ భేటీ..

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat