చివరి గింజ వరకు రైతుల వద్ద నుంచి మద్దతు ధరపై ధాన్యం కొనుగోలు చేస్తామని రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ తెలిపారు.మంగళవారం ధాన్యం కొనుగోలు ప్రక్రియ పై జగిత్యాల సమీకృత జిల్లా కలెక్టరేట్ లోని స్టేట్ ఛాంబర్ లో రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్, ఎమ్మెల్యేలు విద్యాసాగర్ రావు, డాక్టర్ సంజయ్ కుమార్, జెడ్పీ చైర్ పర్సన్ దావ వసంత, డిసిఎంఎస్ ఛైర్మన్ ఎల్లాల శ్రీకాంత్ రెడ్డి, జిల్లా జెడ్పీ వైఎస్ చైర్మన్ హరిచరణ్ రావు జిల్లా కలెక్టర్ యాస్మిన్ బాష తో కలిసి రివ్యూ నిర్వహించారు.
యాసంగి ధాన్యం కొనుగోలు ప్రక్రియకు సంబంధించి జిల్లాలో జరుగుతున్న పనుల వివరాలను కలెక్టర్ మంత్రికి వివరించారు. అనంతరం క్షేత్రస్థాయిలో వచ్చే సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించుకుంటూ రైతులకు ఇబ్బందులు కలగకుండా దాన్యం కొనుగోలు చేసేందుకు తీసుకోవాల్సిన చర్యలపై
మంత్రి అధికారులకు పలు సూచనలు చేశారు.అనంతరం మంత్రి పాత్రికేయుల సమావేశం నిర్వహించి ధాన్యం కొనుగోలుపై నిర్వహించిన సమావేశం గురించి వివరించారు.
అకాల వర్షాల కారణంగా వచ్చిన ఇబ్బందులకు సీఎం కేసీఆర్ వెంటనే స్పందించి, రైతులకు ఇబ్బందులు కలగకుండా తక్షణ చర్యలు తీసుకున్నా మని, పంట నష్టపోయిన వారికి ప్రతి ఎకరానికి 10 వేల చొప్పున మొదటి విడత మంజూరు చేశామని తెలిపారు.రైతుల సంక్షేమం కోసం రాష్ట్ర ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంటుందని, ప్రతి సంవత్సరం దాదాపు పదివేల కోట్లు ఖర్చు చేస్తూ 24 గంటల ఉచిత విద్యుత్ సరఫరా చేస్తున్నామని, నీటి తీరువా రద్దుచేసి ఉచితంగా సాగునీరు అందిస్తున్నామని, రైతుబంధు, రైతు బీమా పథకాలు అమలు చేస్తున్నామని, సకాలంలో ఎరువులు, విత్తనాలు సరఫరా చేస్తున్నామని తెలిపారు. ప్రభుత్వం తీసుకుంటున్న రైతు సంక్షేమ చర్యల కారణంగా 2014తో పోలిస్తే చాలా రేట్లు పంట విస్తీర్ణం పెరిగిందని మంత్రి పేర్కొన్నారు.
జగిత్యాల జిల్లాలో 410 ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి 4 లక్షల 56 వేల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలుకు ప్రణాళికలు తయారు చేశామని, జిల్లాలో ఇప్పటివరకు 1 లక్ష 59 వేల 626 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేశామని, గత సంవత్సరం 74,929 హెక్టార్ల సాగు జరగ్గా ఈ సంవత్సరం 1లక్ష 12 వేల 040 సాగు జరిగింది, 37,111 హెక్టార్లలో ఎక్కువ సాగు జరిగిందని మంత్రి తెలిపారు.రైతులకు వద్ద నుంచి చివరి గింజ వరకు మద్దతు ధరపై ధాన్యం కొనుగోలు చేస్తామని, ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని అన్నారు. రైస్ మిల్లర్ల వద్ద స్థలం సమస్య ఉండటం, క్షేత్రస్థాయిలో కొన్ని ఇబ్బందులు ఉండటం వల్ల రైస్ మిల్లుల వద్ద ధాన్యం దిగుబడిలో కొంత ఆలస్యం జరిగిందని, ఇకనుంచి ఆ సమస్యలను పరిష్కరించేందుకు చర్యలు తీసుకున్నా మని, ప్రతి మండలానికి జిల్లా అధికారిని ప్రత్యేక అధికారిగా నియమించి క్షేత్ర స్థాయిలో వచ్చే చిన్న, చిన్న సమస్యలను వెంటనే పరిష్కరిస్తామని అన్నారు.
రైస్ మిల్లుల వద్ద 24 గంటల్లో లారీ నుంచి ధాన్యం దిగుబడి చేసుకునేలా ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశామని, జిల్లా కలెక్టర్, అధికారులు ప్రతిరోజు పర్యవేక్షిస్తూ సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరిస్తారని, రైతులను ఇబ్బంది పెట్టే రైస్ మిల్లర్ల పై చర్యలు తీసుకోవడం జరుగుతుందని, ధాన్యం కొనుగోలు కేంద్రంలో వేసిన తూకం కొనుగోలు కేంద్రాల వద్ద కోత పెడితే కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని నిబంధనలు తూచా తప్పకుండా అమలు చేయాలని మంత్రి పేర్కొన్నారు.రైతుల అంశంలో ప్రతిపక్షాలు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి గారు అనవసరపు రాజకీయం చేస్తున్నాయని, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ 40 పాలనలో రైతుల ఆత్మహత్య చేసుకున్నారని, ఎరువు కోసం లైన్ లో నిలుచుని, తక్కువ పంట విస్తీర్ణం ఉన్నప్పటికీ సరైన సమయంలో ఎరువులు, విత్తనాలు పంపిణీ చేయలేదని కరెంటు ఇబ్బందులతో రైతులు అనేక ఇబ్బందులకు గురైన విషయం అందరికీ తెలుసునని మంత్రి గుర్తు చేశారు.
దేశంలో రైతులు పండించిన ధాన్యాన్ని పూర్తి స్థాయిలో కొనుగోలు చేస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ మాత్రమేనని, అనేక రాష్ట్రాల్లో దాన్యం కొనుగోలు కేంద్రాలు ఎత్తివేసారని, పక్క రాష్ట్రాల్లో 15 కిలోలు మాత్రమే కొనుగోలు చేస్తున్నారని మంత్రి తెలిపారు.ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో ఎదురవుతున్న ఇబ్బందులు పరిష్కారానికి జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో కఠినంగా వ్యవహరిస్తామని, ప్రతి మండలంలో ప్రత్యేక అధికారి క్షేత్ర స్థాయిలో పరిశీలిస్తూ రైతులకు ఎప్పటి కప్పుడు సమస్య పరిష్కరిస్తామని మంత్రి పేర్కొన్నారు.