తెలంగాణ రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ ఈరోజు శనివారం మహబూబ్‌నగర్‌లో పర్యటించనున్నారు. జిల్లా కేంద్రం సమీపంలోని దివిటిపల్లి వద్ద నిర్మించిన ఐటీ కారిడార్‌ను ఉదయం 11 గంటలకు ప్రారంభిస్తారు. అక్కడే ఎనిమిది కంపెనీల ప్రతినిధులతో ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌తో కలిసి ఎంవోయూలు కుదుర్చుకుంటారు. ఆయా కంపెనీలకు ఐటీ టవర్‌లో స్థలాన్ని కేటాయిస్తారు. అనంతరం కారిడార్ వెనుక భాగంలో సుమారు 270 ఎకరాల్లో నిర్మించనున్న అమరరాజా లిథియం బ్యాటరీ కంపెనీకి శంకుస్థాపన చేస్తారు.
అనంతరం పవర్‌పాయింట్ ప్రజెంటేషన్, బ్యాటరీ కంపెనీ ప్రతినిధులతో సమావేశం ఉంటుంది. మధ్యాహ్నం 12 గంటలకు జిల్లా కేంద్రంలోని పలు జంక్షన్లను ప్రారంభిస్తారు.
అనంతరం బాలుర జూనియర్ కళాశాల మైదానంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ప్రసంగిస్తారు. సభ ముగిసిన వెంటనే మినీ ట్యాంక్‌బండ్ వద్ద నిర్మించనున్న ఐల్యాండ్ సుందరీకరణ పనులకు శంకుస్థాపన చేసి శిల్పారామాన్ని ప్రారంభిస్తారు.