సంస్థ నిర్వాహణ లో భాగంగా వ్యయ నియంత్రణలో భాగంగా ఉద్యోగులకు లేఆఫ్‌లు ప్రకటిస్తున్న కంపెనీల జాబితాలో ఈకామర్స్ సంస్థ మీషో కూడా చేరింది. ఖర్చు తగ్గించుకునేందుకు, లాభాలను సాధించడానికి గానూ 251 మంది ఉద్యోగులను తొలగించనున్నట్టు ఈ సంస్థ ప్రతినిధి నిన్న శుక్రవారం వెల్లడించారు.
మొత్తం ఉద్యోగుల్లో ఇది దాదాపు 15 శాతానికి సమానం. ఉద్యోగాల నుంచి తొలగించిన వారికి మీషో వ్యవస్థాపకుడు, సీఈవో విదిత్ ఆత్రే ఈమెయిల్ పంపించారు.ఈ నిర్ణయం తీసుకోవడానికి గల కారణాలను ఆయన ఇందులో వివరించారు.
ఉద్యోగాలు కోల్పోయిన వారికి నోటీస్ పీరియడ్‌కు అదనంగా ఒక నెల వేతనం అందించనున్నట్టు ఆయన తెలిపారు. 2020 నుంచి 2022 మధ్యన కొవిడ్‌ను ఎదుర్కొంటూనే సంస్థ 10 రెట్లు ఎదిగిందని ఆయన తెలిపారు. అయితే, నగదు నిల్వలు తగ్గడం వల్ల సంస్థ ఇబ్బందులు ఎదుర్కొంటున్నందున వ్యయనియంత్రణ కోసం లేఆఫ్‌ల నిర్ణయం తీసుకుంటున్నట్టు ఆయన వివరించారు.