ఏపీ మాజీ ముఖ్యమంత్రి.. ప్రధాన ప్రతిపక్ష పార్టీ టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడి గత ప్రభుత్వ హయాంలో జరిగిన అవకతవకలపై దర్యాప్తు కోసం ఏపీ ప్రభుత్వం ఏర్పాటు చేసిన సిట్‌కు లైన్‌క్లియర్ అయ్యింది. దీనిపై హైకోర్టు ఇచ్చిన స్టేను సర్వోన్నత న్యాయస్థానం కొట్టేస్తూ బుధవారం తీర్పు ఇచ్చింది.
చంద్రబాబు సీఎంగా ఉన్న సమయంలో కీలక విధాన నిర్ణయాలు, అమరావతి భూ కుంభకోణం సహా భారీ ప్రాజెక్టులలో అవకతవకలు జరిగినట్టు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గుర్తించింది. ఈ క్రమంలో సిట్ దర్యాప్తునకు ఆదేశించింది. సిట్ నియామకంపై టీడీపీ నేతలు ఏపీ హైకోర్టులో పిటిషన్ వేశారు. దీంతో హైకోర్టు స్టే విధించింది.
ఈ స్టేను సవాల్ చేస్తూ ఏపీ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. దర్యాప్తు ప్రాథమిక దశలోనే స్టే ఇవ్వటం సరైంది కాదన్న సుప్రీంకోర్టు ..సీబీఐ, ఈడీ దర్యాప్తునకు సైతం ఏపీ ప్రభుత్వం పంపేందుకు సిద్ధమైన ఈ కేసులో స్టే అవసరం లేదని పేర్కొన్నది. సిట్ ఏర్పాటు కోసం ఇచ్చిన జీవోలు గత ప్రభుత్వ విధానాలను మార్చడానికి ఇవ్వలేదని, జీవోలో ఇచ్చిన టర్మ్ ఆఫ్ రిఫరెన్స్ హైకోర్టు పరిశీలించలేదని సుప్రీం బెంచ్ అభిప్రాయపడింది. ఈ తరుణంలో హైకోర్టు తీర్పును పక్కన పెడుతున్నట్టు జస్టిస్ ఎంఆర్ షా నేతృత్వంలోని ధర్మాసనం తీర్పు ఇచ్చింది.