ప్రకృతి సిద్ధమైన, స్వచ్ఛమైన నీరాను రాష్ట్ర ప్రజలకు ప్రభుత్వం అందించడం ద్వారా గీత వృత్తిదారులకు ఎంతో ప్రయోజనకరమని ముఖ్యమంత్రి కేసీఆర్ కృషి పట్ల షాద్ నగర్ ఎమ్మెల్యే వై. అంజయ్య యాదవ్ కొనియాడారు. రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ గౌడ సంఘం అధ్యక్షులు నక్క మల్లేష్ గౌడ్ ఆధ్వర్యంలో పట్టణంలోని సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ విగ్రహం వద్ద నివాళులు అర్పించి ముఖ్యమంత్రి కేసీఆర్ చిత్రపటానికి గౌడన్నలు పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వై. అంజయ్య యాదవ్ మాట్లాడుతూ.. రైతు బీమా తరహాలో గీత కార్మికుల బీమాను ప్రకటించిన సీఎం కేసీఆర్, కేటీఆర్ చిత్తశుద్ధి పై హర్షం హర్షం వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా ఎమ్మేల్యే మాట్లాడుతూ.. గీత వృత్తి ప్రోత్సాహానికి సీఎం కేసీఆర్ ఎంతో కృషి చేస్తున్నారన్నారు. రైతు బీమా మాదిరిగా గీత కార్మికుల కోసం రూ. 5 లక్షల బీమాను కల్పించినందుకు సీఎం కేసీఆర్‌కు కృతజ్ఞతలు తెలిపారు. దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా 50 ఏండ్ల వయస్సు పైబడిన, అర్హులైన దాదాపు లక్ష మంది గీత కార్మికులకు ప్రతి నెల రూ. 2016 ల పెన్షన్లు అందిస్తున్నామన్నారు. మద్యం దుకాణం కేటాయింపుల్లో గౌడ సామాజిక వర్గానికి 15 శాతం, ఎస్సీ, ఎస్టీలకు 15 శాతం రిజర్వేషన్లు కల్పించడం సాహోసోపేతమైన నిర్ణయంతో అన్ని వర్గాలకు సమన్యాయం చేస్తున్నారని పేర్కొన్నారు.
ఈ సందర్భంగా షాద్ నగర్ గౌడ సంఘం నాయకులు పోలేపల్లి శ్రీనివాస్ గౌడ్, నక్క మల్లేష్ గౌడ్, కొమ్మగంటి జగన్ గౌడ్ మీడియాతో మాట్లాడుతూ.. గీత వృత్తి ప్రోత్సాహం కోసం తెలంగాణకు హరితహారంలో ఎక్సైజ్ శాఖ ఆధ్వర్యంలో సుమారు 4 కోట్ల 20 లక్షల తాటి, ఈత మొక్కలు ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా నాటించిందని గుర్తు చేశారు. తాటి, ఈత చెట్లను అక్రమంగా నరికి వేసే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటున్నారని తెలిపారు.
రాష్ట్ర ప్రజలకు స్వచ్ఛమైన, ప్రకృతి సిద్ధమైన నీరాను అందించేందుకు ప్రతిష్టాత్మకంగా నీరా పాలసీని ప్రవేశపెట్టారని వారు తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలో గీత వృత్తిదారులు మాత్రమే నీరాను ఉత్పత్తి చేసి, అమ్మకాలు జరిపేలా నీరాపాలసీని రూపొందించారని పేర్కొన్నారు.గీత కార్మికులకు ఎక్స్ గ్రేషియాను రూ. 2 లక్షల నుండి రూ. 5 లక్షలకు పెంచడం జరిగిందని తెలిపారు. అలాగే, శాశ్వత అంగవైకల్యం చెందిన వారికి గతంలో ఇచ్చిన రూ. 50 వేల ఆర్థిక సహాయాన్ని రూ. 5 లక్షలకు పెంచడం జరిగిందన్నారు. కల్లు దుకాణాలు నెలవారి కిస్తీ, తాటి, ఈత చెట్ల పన్ను రద్దు చేయడం ద్వారా 7743 కల్లు దుకాణాలకు చెందిన 2లక్షల 34 వేల 576 గౌడ కుటుంబాలకు లబ్ధి చేకూరిందన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీలు శివరాములు గౌడ్, వన్నాడ ప్రకాష్ గౌడ్, శివలింగం గౌడ్, పోలేపల్లి శ్రీనివాస్ గౌడ్ రాములు గౌడ్, రామస్వామి గౌడ్, కలాల్ శ్రీనివాస్ గౌడ్, నాట్కో శ్రీనివాస్ గౌడ్, రవి గౌడ్, మారుతి గౌడ్, వెంకటేష్ గౌడ్, శేఖర్ గౌడ్, శ్రీశైలం గౌడ్, దర్శన్ గౌడ్, కొమ్మగంటి జగన్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు