తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి.. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పై ఏపీ అధికార వైసీపీకి చెందిన శ్రీకాళహస్తి వైసీపీ ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్‌రెడ్డి ప్రశంసల వర్షం కురిపించారు. ఆయన మాట్లాడుతూ కేవలం రెండు అంటే రెండేండ్ల సమయంలోనే రూ.650 కోట్లతో అద్భుతంగా సెక్రటేరియట్ కట్టి చూపించిన తెలంగాణ సీఎం కేసీఆర్ రియల్ హీరో అని ఆయన ప్రశంసించారు.
రైతుల కోసం కాళేశ్వరం ప్రాజెక్టు, సుపరిపాలన కోసం అతి తక్కువ సమయంలో అత్యాధునిక సెక్రటేరియట్ కట్టిన కేసీఆర్‌ది రియల్ విజన్ అని కొనియాడారు. పక్క రాష్ట్రం సీఎం అయినా కేసీఆర్‌ను తాము కచ్చితంగా పొగుడుతామని ఈ సందర్భంగా ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి స్పష్టంచేశారు. విజనరీ అని చెప్పుకొంటున్న ఏపీ మాజీ సీఎం.. టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు ఓ డూప్లికేట్ అని మండిపడ్డారు.
చంద్రబాబుకు ఐదేండ్ల సమయం ఉన్నా రూ.1200 కోట్లు ఖర్చుపెట్టి సెక్రటేరియట్ పేరుతో రేకుల షెడ్లు వేశారని, వానొస్తే నీళ్లు లోపలికి వస్తున్నాయని, బాత్రూంలు కూడా లేవని దుయ్యబట్టారు. రాజధాని, సెక్రటేరియట్ పేరుతో రూ.15 వేల కోట్ల ఫండింగ్ చేసి తాత్కాలిక భవనాలు కట్టి భూమిలో నీళ్లు పోసినట్టు పైసలు ఖర్చుపెట్టారని మండిపడ్డారు. ‘ఎప్పుడూ ఒరిజనల్ లేదు.. ఆయన బతుకంతా టెంపరరీయే’ అని ఎద్దేవా చేశా రు. తెలంగాణ ప్రభుత్వం నిర్మించిన నూతన సచివాలయాన్ని చూసి తాము మురిసిపోయామని పేర్కొన్నారు. విజన్ అంటే కేసీఆర్‌దేనని, చంద్రబాబుది కాదని స్పష్టంచేశారు.