తెలుగు సినిమా ఇండస్ట్రీలో కొన్ని కాంబినేషన్స్ పట్ల ప్రేక్షకులు ఎంతో ఆసక్తిని కనబరుస్తారు. అందులో సూపర్ స్టార్ మహేష్‌బాబు-మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబో ఒకటి. వీరిద్దరి కలయికలో గతంలో అతడు, ఖలేజా వంటి హిట్ చిత్రాలొచ్చాయి. దాంతో మహేష్‌బాబు కథానాయకుడిగా త్రివిక్రమ్ రూపొందిస్తున్న తాజా హ్యాట్రిక్ చిత్రంపై అభిమానుల్లో భారీ అంచనాలేర్పడ్డాయి.
ఈ సినిమాకు సంబంధించిన కొత్త షెడ్యూల్ త్వరలో మొదలుకానుంది. ఇదిలావుండగా ఈ చిత్ర టీజర్‌ను దివంగత సూపర్‌స్టార్ కృష్ణ జన్మదినమైన మే 31న విడుదల చేయబోతున్నట్లు గత కొంతకాలంగా వార్తలొస్తున్నాయి.
తాజాగా వీటిని ధృవీకరించారు చిత్ర నిర్మాత సూర్యదేవర నాగవంశీ. ఈ మేరకు ఆయన తన ట్విట్టర్‌లో ఓ పోస్ట్ చేశారు. మే 31న ఇంట్రెస్టింగ్ అప్‌డేట్ కోసం ఫ్యాన్స్ అందరూ వేచిచూడండంటూ టీజర్ గురించి పరోక్షంగా ప్రస్తావించారు. దీంతో మహేష్‌బాబు అభిమానులు ఖుషీ అవుతున్నారు. ఈ చిత్రంలో పూజాహెగ్డే, శ్రీలీల నాయికలుగా నటిస్తున్నారు. వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా ఈ చిత్రాన్ని విడుదల చేయబోతున్నారు.