తెలంగాణ రాష్ట్ర అధికార పార్టీ అయిన బీఆర్ఎస్ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను ఈ నెల 27న జరుపుకోవాలని ఆ పార్టీ అధినేత.. ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయించిన సంగతి తెల్సిందే.
దీంతో గులాబీ పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని అధికార బీఆర్ఎస్ పార్టీ రాష్ట్రవ్యాప్తంగా మినీ ప్లీనరీలు నిర్వహిస్తున్నది. అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా పార్టీ ప్రతినిధుల సభలను ఏర్పాటుచేసింది. ఇందులో భాగంగా రాష్ట్రంలోని ప్రతి గ్రామం, పట్టణం, నగరాల్లో వాడవాడనా బీఆర్ఎస్ జెండా పండుగను ఘనంగా నిర్వహిస్తున్నారు.
దీంతో ఊరూరా గులాబీ జెండా రెపరెపలాడుతున్నది. జై తెలంగాణ, జై భారత్, జై కేసీఆర్ నినాదాలతో పట్టణాలు, పల్లెలు అని తేడాలేకుండా మారుమోగుతున్నాయి. ఊరూరా పార్టీ జెండాలను ఆవిష్కరించిన తర్వాత పార్టీ కార్యకర్తలు, నాయకులు నియోజకవర్గం కేంద్రంలో ఏర్పాటు చేసే ప్రతినిధుల సభకు చేరుకుంటున్నారు.
ప్రతి సభలో మూడు వేల నుంచి 3,500 మంది కార్యకర్తలు, పార్టీ ప్రతినిధులు పాల్గొననున్నారు. ఈ సందర్భంగా పార్టీ శ్రేణులను ఎన్నికల దిశగా ఎలా కార్యోన్ముఖులను చేయాలి? స్వరాష్ట్ర సాధన తర్వాత తెలంగాణ సాధించిన విజయ పరంపర, రాష్ర్టానికి బీజేపీ ప్రభుత్వం చేస్తున్న మోసం తదితర అంశాలపై తీర్మానాలు చేయనున్నది.