అభివృద్ధి చెందుతున్న తెలంగాణను నాశనం చేసేందుకు బీజేపీ కుటిల ప్రయత్నాలను చేస్తుందని మెదక్ ఎమ్మెల్యే, బీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షురాలు పద్మా దేవేందర్ రెడ్డి ఆరోపించారు. మంగళవారం మెదక్‌లో నిర్వహించిన బీఆర్‌ఎస్ పార్టీ ప్రతినిధుల సభలో ఆమె మాట్లాడారు.పార్టీ అధ్యక్షుడు కేసీఆర్ సీఎం అయ్యాకే తెలంగాణ ఎంతో అభివృద్ధి చెందిందన్నారు.
రైతులకు ఉచిత కరెంట్, రైతు బంధు, రైతు బీమా, ఆడబిడ్డలకు కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ తదితర పథకాలు దేశానికే ఆదర్శంగా నిలిచాయని పేర్కొన్నారు. దళితులు ఆర్థిక స్వాలంబన కోసం ప్రభుత్వం దళిత బంధు ను ప్రవేశ పెట్టిందని పేర్కొన్నారు. బీజేపీ నాయకులు చేస్తున్న ఆరోపణలను తిప్పికొట్టాలని బీఆర్‌ఎస్ నాయకులకు పిలుపునిచ్చారు.
కేంద్రం అవలంభిస్తున్న తీరును ప్రశ్నిస్తే కేసులు ఈడీ , ఐటీ పేరుతో దాడులకు పాల్పడుతున్నారని విమర్శించారు. కేంద్రం పెట్టే కేసులకు తెలంగాణ బయపడదని ఆమె అన్నారు. నరేంద్ర మోదీ అధికారంలోకి వచ్చిన తరువాత వంట గ్యాస్, డీజిల్, పెట్రోల్ ధరలు విఫరీతంగా పెంచారని మండిపడ్డారు. అధానీ, అంబానీలకు దేశ సంపదను దోచి పెడుతూ సామాన్యులపై పెను భారం మోపుతున్నారని పేర్కొన్నారు.
సీఎం కేసీఆర్ అన్ని వర్గాల అభ్యున్నతికి పాటుపడుతున్నారని తెలిపారు. బీఆర్‌ఎస్ మూడో సారి అధికారంలోకి రావడం ఖాయమని ఆమె అన్నారు. అమిత్ షా లాంటి వ్యక్తులు రాష్ట్రానికి అతిధి అని రాష్ట్ర ప్రజలు హక్కుదారులని వెల్లడించారు.