సన్నరకం ధాన్యానికి భారీగా డిమాండ్ పెరిగింది. యాసంగి సీజన్‌లో గతంలో ఎప్పుడూ లేనివిధంగా క్వింటాలుకు రూ.2,500 వరకు ధర పలుకుతున్నది. అయినప్పటికీ మిల్లర్లు, వ్యాపారులు పొటీపడి కొనుగోలు చేస్తున్నారు.
రైతులు పంట కోసిందే ఆలస్యం మిల్లర్లు, వ్యాపారులు పొలంలోకే వెళ్లి ధాన్యం కొంటున్నారు. కొందరైతే రైతులకు ముందుగానే అడ్వాన్స్ చెల్లిస్తున్నారు. దేశంలో డిమాండ్‌కు సరిపడా ఉత్పత్తి లేకపోటమే దీనికి కారణమని వ్యాపారులు చెప్తున్నారు.
ఈ సీజన్‌లో దేశవ్యాప్తంగా వరిసాగు భారీగా తగ్గింది. అదే సమయంలో ఒక్క తెలంగాణలో మాత్రమే వరి సాగు పెరగటం గమనార్హం. ప్రస్తుతం వరికి మద్దతు ధర క్వింటాలుకు రూ.2060 ఉన్నది. ఈ లెక్కన రైతులకు మద్దతు ధరకు మించి సుమారు రూ.400-500 వరకు దక్కుతున్నది.
ధాన్యం కొనుగోలు సమయంలో 17 శాతం వరకు తేమను అనుమతిస్తారు. కానీ 27-30 శాతం తేమ ఉన్నా, వ్యాపారులు భారీ ధర వెచ్చించి మరీ కొనుగోలు చేస్తున్నారు. ఈ విధంగా మిల్లర్లు పచ్చి ధాన్యమే కొంటుడటంతో తూకం పెరిగి.. రైతులకు మద్దతు ధరకు అదనంగా మరో రూ.100-200 వరకు గిట్టుబాటవుతున్నది.