తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ చుట్టూ వివిధ జిల్లాలను కలుపుతూ నిర్మించ తలపెట్టిన రీజనల్ రింగురోడ్డు (త్రిఫుల్ ఆర్)పై కేంద్ర ప్రభుత్వం దొంగ నాటకం అడుతున్నది. భూసేకరణ పేరుతో మెలికపెట్టి ప్రాజెక్టును ముందుకు సాగకుండా చేస్తున్నది. రోడ్డు ఏర్పాటుకు అయ్యే ఖర్చులు టోల్‌ట్యాక్స్ రూపంలో తాము రాబట్టుకొని, భూసేకరణ ఖర్చులు మాత్రం రాష్ట్ర ప్రభుత్వంపై మోపాలని ఎత్తుగడ వేసింది. ఉల్టాచోర్ కోత్వాల్ కో డాంటే అనే చందంగా తప్పంతా తమ దగ్గర పెట్టుకొని రాష్ట్ర ప్రభుత్వం వల్లే ప్రాజెక్టు ముందుకు సాగడంలేదని బుకాయిస్తున్నది.
భారమంతా రాష్ట్రంపైనే
భారత జాతీయ రహదారుల సంస్థ (ఎన్‌హెచ్‌ఏఐ) ఆధ్వర్యంలో 340 కిలోమీటర్ల పొడవున నాలుగు లేన్ల ఆర్‌ఆర్‌ఆర్ ఎక్స్‌ప్రెస్‌వేను కేంద్రం మంజూరు చేసింది. ఉత్తర, దక్షిణ భాగాలుగా దీనిని అభివృద్ధి చేయాలని నిర్ణయించారు. భారత్‌మాల పరియోజన (బీఎంపీ) ఫేజ్-1లో భాగంగా కేంద్రం దీన్ని చేపడుతున్నది. ఉత్తర భాగం కింద రూ.9,500 కోట్ల అంచనా వ్యయంతో సుమారు 164 కిలోమీటర్లమేర రోడ్డు నిర్మిస్తారు. ఇది సంగారెడ్డి, నర్సాపూర్, తూప్రాన్, గజ్వేల్, యాదాద్రి, ప్రజ్ఞాపూర్, భువనగిరి, చౌటుప్పల్ తదితర పట్టణాలమీదుగా వెళ్తుంది.
దక్షిణ భాగం కింద రూ. 6,480 కోట్లతో 182 కిలోమీటర్లమేర నిర్మించే రోడ్డు చౌటుప్పల్, ఇబ్రహీంపట్నం, కందుకూరు, ఆమన్‌గల్, చేవెళ్ల, శంకర్‌పల్లి, సంగారెడ్డి తదితర పట్టణాలగుండా వెళ్తుంది. ఈ రహదారి నిర్మాణంలో భూసేకరణే కీలకాంశం. భూసేకరణకే దాదాపు రూ.5,300 కోట్లకుపైగా ఖర్చవుతుందని అంచనా. ఇందులో సగభాగం రాష్ట్ర ప్రభుత్వం భరిస్తేనే ప్రాజక్టును చేపడతామని కేంద్ర రహదారుల శాఖ మెలిక పెట్టింది. ఇంత ఖర్చుపెట్టినా రాష్ట్రప్రభుత్వానికి ఆర్‌ఆర్‌ఆర్ ద్వారా వచ్చే ఆదాయం ఏమీ ఉండదు. రోడ్డు నిర్మాణం పూర్తయిన తర్వాత వాహనదారుల నుంచి టోల్‌ట్యాక్స్ వసూలు చేసుకొనేది కేంద్రమే. రోడ్డు ఏర్పాటుకు అయ్యే ఖర్చులను ముందుగా ఏజెన్సీ భరించి అనంతరం ట్యాక్స్ రూపంలో వడ్డీతోసహా వసూలు చేస్తారు. ఇందులో కేంద్ర ప్రభుత్వం ఇచ్చేది కూడా ఏమీ ఉండదు. రాష్ట్ర ప్రభుత్వంపై మోపిన భూసేకరణ భారం మాత్రం తిరిగి రాబట్టుకొనే అవకాశం లేదు.