బీజేపీ నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వం అవలంభిస్తున్న నిరంకుశ విధానాలను నిరసిస్తూ ప్రతిపక్షాల ఆందోళన గురువారం కూడా కొనసాగింది.అదానీ ఆర్థిక నేరాలపై సమగ్ర విచారణకు గాను సంయుక్త పార్లమెంటరీ సంఘాన్ని (జేపీసీ)వేయాలని, కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీపై వేసిన అనర్హత వేటును వెంటనే ఉపసంహరించాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి.అదేవిధంగా ప్రతిపక్షాలకు చెందిన ప్రముఖులు, నాయకులపై ఐటీ,ఈడీ, సీబీఐలను ప్రయోగించి వేధింపులకు గురి చేయడాన్ని వెంటనే ఆపేయాలని బీఆర్ఎస్,కాంగ్రెసు, డీఎంకే, టీఎంసీ, ఎండీఎంకే,ఆప్, ఎస్పీ, ఆర్జేడీ, సీపీఐ, సీపీఎంలు ఆందోళనకు దిగాయి.
పార్లమెంట్ సమావేశాలు ప్రారంభం కాగానే ప్రతిపక్షాల ఎంపీలు నినాదాలివ్వడంతో ఉభయ సభలు స్తంభించిపోయాయి.అధికారపక్షం సభలను మధ్యాహ్నానికి వాయిదా వేయడంతో ప్రతిపక్షాల ఎంపీలు కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద పెట్టున నినాదాలిస్తూ బయటకు వచ్చి జాతీయ జెండాలు చేతబట్టి విజయ్ చౌక్ వరకు మార్చ్ నిర్వహించారు.రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర రాజ్యసభలో కాంగ్రెస్ పక్ష నాయకులు మల్లికార్జున ఖర్గే, బీఆర్ఎస్ పార్లమెంటరీ నేత కే.కేశవరావు,లోకసభలో బీఆర్ఎస్ పక్ష నాయకులు నామా నాగేశ్వరరావు,ఎంపీలు పార్థసారథి రెడ్డి, కే.ఆర్.సురేష్ రెడ్డి,బడుగుల లింగయ్య యాదవ్,పీ.రాములు,బాలు (డీఎంకే),సంజయ్ సింగ్ (ఆప్) తదితర ప్రముఖులతో కలిసి ఈ మార్చ్ లో అగ్రభాగాన ఉన్నారు.
“ప్రధాని నరేంద్ర మోడీ ఆప్తమిత్రుడు అదానీ వ్యవహారంపై జేపీసీ వేయాలంటూ”, “రాహుల్ గాంధీపై వేసిన అనర్హత వేటును వెనక్కి తీసుకోవాలని”,”ప్రతిపక్షాలపై ఐటీ,ఈడీ, సీబీఐలను ప్రయోగించడాన్ని ఆపేయాలని”,”మోడీ దాదాగిరి చెల్లదు కాక చెల్లదు”,”మోడీ నిరంకుశ విధానాలను ఎండగట్టండి”, “ప్రజాస్వామ్యాన్ని కాపాడండి”అంటూ ఎంపీలు పెద్ద పెట్టున నినాదాలిచ్చారు.అనంతరం ప్రతిపక్ష నాయకులు కానిస్టిట్యూషనల్ క్లబ్ లో విలేకరులతో మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం అవలంభిస్తున్న నియంతృత్వ విధానాలను ఎండగట్టారు.