విద్యార్థుల జీవితాలతో బీజేపీ చెలగాటం ఆడుతోందని మంత్రి హరీశ్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. పదో తరగతి పిల్లలతో క్షుద్ర రాజకీయాలకు పాల్పడుతోందని అన్నారు. బాలల భవిష్యత్తుతో ఎవరైనా ఆడుకుంటారా అని హరీశ్ రావు ప్రశ్నించారు. దమ్ముంటే రాజకీయంగా కొట్లాడాలని అన్నారు. కానీ ఇవాళ పిల్లల జీవితాలతో బీజేపీ పార్టీ చెలగాటం ఆడుతోందని అసహనం వ్యక్తం చేశారు.
రాజకీయంగా కొట్లాడటం చేతగాక దిక్కుమాలిన, దిగజారుడు రాజకీయాలకు బీజేపీ పాల్పడుతోందని హరీశ్ రావు విమర్శించారు. పట్టపగలు బండి సంజయ్, బీజేపీ పార్టీ దొరికిపోయాయని హరీశ్ రావు అన్నారు. స్పష్టంగా దొరికిపోయినప్పటికీ మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తున్నారని ఎద్దేవా చేశారు. పిల్లల జీవితాలను తాకట్టు పెట్టి రాజకీయాలు అవసరమా అని బీజేపీ నేతలపై మండిపడ్డారు. ఏ ప్రభుత్వంపైనా భవిష్యత్తు తరాల కోసం పనిచేస్తుందని స్పష్టం చేశారు. రాష్ట్రంలో బీఆర్‌ఎస్ ప్రభుత్వం ఉందని.. కేంద్రంలో బీజేపీ ఉందన్నారు. మనం భవిష్యత్తు తరాల కోసం పనిచేయాలి కానీ.. రాజకీయాల కోసం భవిష్యత్తు తరాల జీవితాలతో ఆడుకోవడం సమంజసం కాదన్నారు. ఇదంతా రాష్ట్ర, దేశ ప్రజలు గమనిస్తున్నారని తెలిపారు.
మధ్యాహ్నం ఏమో పేపర్ లీకైందని బీజేపీ నాయకులు ధర్నా చేసిన్రు.. సాయంత్రం ఏమో పేపర్ లీకేజీకి బాధ్యులై అరెస్టయిన వారిని విడుదల చేయాలని అదే బీజేపీ చేసిందని అన్నారు. దీన్ని బట్టి అరెస్టు అయ్యింది పక్కా బీజేపీ దొంగ.. బీజేపీ నాయకుడు.. బీజేపీ కార్యకర్త అని అర్థమవుతోందని అన్నారు. ‘ మీరే పథకం ప్రకారం లీకేజీలకు పాల్పడుతూ.. దాన్ని సోషల్ మీడియాలో ప్రచారం చేస్తూ.. రాజకీయంగా వాడుకుని మా మీద బురద జల్లే ప్రయత్నం చేసిన్రు. పసిపిల్లలను అడ్డం పెట్టుకుని రాజకీయం చేసే ప్రయత్నం చేసిన్రు.’ అని విమర్శించారు. బీజేపీ అంటేనే ఒక విద్వేషం.. ఒక విచ్ఛిన్నం చేసే కుట్ర, విధ్వంసం చేసే కుట్ర అని మంత్రి హరీశ్ రావు అన్నారు. ఎంతసేపు రాజకీయాల కోసం, అధికారం కోసం ఏదైనా చేస్తారని అర్థమవుతుందని తెలిపారు. దీన్ని విద్యార్థులంతా గమనిస్తున్నారని అన్నారు. విద్యార్థులు దీన్ని తిప్పికొట్టాలని.. బీజేపీకి తగిన గుణపాఠం చెప్పాలని పిలుపునిచ్చారు.‘ పదో తరగతి పిల్లలకు, తల్లిదండ్రులకు ఎక్కడా ప్రశ్నపత్రం లీకవ్వలేదు. ఇదంతా బీజేపీ కుట్ర. ఈ కుట్రలో మనం ఎవరం పడొద్దు. పిల్లలు బాగా చదువుకోవాలని, పిల్లల చదువు మీద దృష్టిపెట్టాలి. ‘ అని విద్యార్థులు, వాళ్ల తల్లిదండ్రులకు విజ్ఞప్తి చేశారు.