‘ఎద్దేడ్చిన ఎవుసం, రైతేడ్చిన రాజ్యం బాగుపదడదని’ ఓ తెలంగాణ సామెత. కానీ, ఎవుసం చేయడమనేది ఓ సాహసం. అట్లా అని రైతన్న అసొంటి సాహసం జేయనని మొండికేస్తే ఈ రాజ్యానికి తిండి పెట్టేదెవరు? అందుకే ఎవుసం కత్తి మీది సామువంటిదైనా తన రక్తాన్ని చెమటగా చిందిస్తాడు రైతన్న. లాభమో, నష్టమో దేశానికి అన్నం పెట్టడానికి ఆ అన్నదాత ఎండనక, వాననక తాను పండించే పంటను కంటికి రెప్పలా కాపాడుకుంటాడు. అలాంటి రైతన్నకు ఈ దేశం ఏమిస్తున్నది, ఏం చేస్తున్నది? రైతుల ఆదాయాన్ని డబుల్ చేస్తానన్న ప్రధాని మోదీ వ్యవసాయరంగంలో నల్ల చట్టాలు తీసుకువచ్చి రైతును వెన్నుపోటు పొడిచే ప్రయత్నం చేశాడు. అన్నదాతలు తిరుగుబాటు చేయడంతో తోక ముడ్చుకొని వెనక్కివెళ్లక తప్పలేదు. కానీ, అధఃపాతాళంలో ఉన్న రైతును అందళం ఎక్కించింది తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్. ఇప్పుడు తెలంగాణలో వ్యవసాయం అంటే ఒక బతుకమ్మ పండుగ. రైతన్న అంటే ఒక రారాజు.
వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చిన రైతే రాష్ర్టానికి పాలకుడైతే ఎలా ఉంటుందో అధికారంలోకి వచ్చిన కొద్దిరోజుల్లోనే ముఖ్యమంత్రి కేసీఆర్ చేసి చూపించారు. కరెంట్ కష్టాలతో అల్లాడిన తెలంగాణ రైతన్నకు 24 గంటల నాణ్యమైన కరెంటును అందజేసిండు. ‘మిషన్ కాకతీయ’ ద్వారా చెరువులను పునరుద్ధరించిండు. కాళేశ్వరంతో పాటు పలు ప్రాజెక్టుల ద్వారా నీళ్లందిస్తున్నాడు. రైతులను అప్పుల ఊబి నుంచి కాపాడాలనే ఉద్దేశంతో బృహత్తర ‘రైతుబంధు’ పథకాన్ని అమలుచేస్తున్నాడు. ప్రభుత్వమే రైతుకు పెట్టుబడి సాయమందించే నూతన చరిత్రకు తెలంగాణ శ్రీకారం చుట్టింది. కేసీఆర్ తీసుకునే విప్లవాత్మక నిర్ణయాలు అద్భుత ఫలితాలనివ్వడమే కాదు, వ్యవసాయం ‘దండుగ’ అన్న పదమే కనుమరుగయ్యేలా చేసిండు ముఖ్యమంత్రి కేసీఆర్.
తెలంగాణలో సాగు విస్తీర్ణం పెరిగింది. పంటలు దండిగా పండుతున్నయ్. అన్నదాతకు ఊతం దొరికింది. ‘అన్ని ఉన్నా… అల్లుడి నోట్లో శని అన్నట్టు..’ పంట చేతికొచ్చే సమయానికి రైతన్నపై పకృతి ఉగ్రరూపం ప్రదర్శించింది. వడగండ్ల వర్షం వచ్చి పంటలను దెబ్బతీసింది. ఈ వడగండ్ల వాన జేయవట్టి కరీంనగర్, వరంగల్, ఖమ్మంతో పాటు పలు జిల్లాల్లో రైతులు తీవ్రంగా నష్టపోయారు. రైతులకు పంటే ప్రాణం.. ఆ ప్రాణమే పోతుంటే వాళ్ల బాధ ఎంత వర్ణణాతీతమో మనం అర్థం చేసుకోవచ్చు. ఈ తరుణంలో రాష్ట్రంలోని రైతాంగానికి అండగా నిలవాలనుకొనే నిర్ణయం తీసుకున్నారు ముఖ్యమంత్రి కేసీఆర్. ముఖ్యమంత్రి కేసీఆరే నేరుగా రైతుల వద్దకే వెళ్లి ధైర్యం చెప్పాలని, వారికి అండగా నిలబడాలనుకున్నారు. ఇందులో భాగంగానే నష్టపోయిన ప్రాంతాలను గురువారం పర్యటించారు. ఓ దిక్కు ఎర్రటి ఎండలు, ఇంకో దిక్కు ఒంట్లో జ్వరం ఉన్నా.. వాటిని లెక్కచేయకుండా ‘నేనున్నాని’ రైతులకు భరోసా ఇచ్చేందుకు ముందుకు కదిలారు. ఈ భరోసా ప్రతి రైతుకు కొండంత ధైర్యాన్నిచ్చింది. నిబంధనలతో పనిలేకుండా మానవతా దృక్పథంతో దేశంలో ఎక్కడా లేనివిధంగా ఎకరానికి రూ.10 వేల ఆర్థిక సహాయాన్ని ప్రకటించారు. పది రోజుల్లో ఆ పరిహారం రైతులకు అందనున్నది. రాజకీయాలంటే ఓట్లు, సీట్లు మాత్రమే కాదు, ప్రజలు కష్టాల్లో ఉన్నప్పుడు కూడా వారికి అండగా నిబడటం నాయకుల విధి అని నిరూపించారు కేసీఆర్.
ముఖ్యమంత్రి కేసీఆర్ పర్యటన తర్వాత రైతులకు ధైర్యం వచ్చింది. పంట నష్టపోయిన రైతులకు బాసటగా నిలవడం పట్ల ముఖ్యమంత్రి కేసీఆర్‌పై హర్షద్వానాలు వ్యక్తమవుతున్నాయి. విద్వేషాలతో రాజకీయాలు చేసే కొందరు వ్యక్తులు, కొన్ని పార్టీలు, ప్రతి అంశంలోనూ తప్పులు వెతికే ప్రయత్నం చేస్తారు. రాష్ట్రంలో వడగండ్ల వాన పడటంలోనూ కేసీఆర్ ప్రభుత్వం కుట్రలు చేసిందని ఆరోపణలు చేసినా మనం ఆశ్చర్యపోనవసరం లేదు.
అయితే బండి సంజయ్ లాంటి మందబుద్ధిగల నాయకుడు రైతులకు రూ.10 వేలు సరిపోవంటూ పనికిరాని విమర్శలు చేస్తున్నాడు. ఆయనకు రైతులపై ప్రేమ ఉంటే కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం తరఫున ఎకరానికి ఓ యాభై వేలు ఇప్పించవచ్చు కదా? అలా ఇప్పిస్తే ఎవరైనా అడ్డుకుంటారా? ప్రకృతి విపత్తులు వచ్చినప్పుడు కేంద్రం కొంత సహాయాన్ని అందజేయాలి. అది చేయకపోగా చేస్తున్నవారిపై విమర్శలు గుప్పించడం దేనికి సంకేతమో అర్థం చేసుకోలేని స్థితిలో తెలంగాణ ప్రజలు లేరనే విషయాన్ని బండి తెలుసుకోవాలి. సీఎం కేసీఆర్‌పై, ఆయన కుటుంబంపై వ్యక్తిగత దూషణలే లక్ష్యంగా పనిచేస్తూ పబ్బం గడుపుకొంటున్న ప్రతిపక్షాలు ఇప్పటికైనా ప్రజా కోణంలో ఆలోచించాలి. రైతాంగాన్ని ఆదుకునేందుకు కేంద్ర ప్రభుత్వానికి నిర్మాణాత్మక సూచనలు చేయాలి. రైతన్నకు సద్దిబువ్వ వలె మారిన కేసీఆర్‌ను చూసైనా కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం బుద్ధి తెచ్చుకోవాలి. ఆ పార్టీ నాయకులను సన్మార్గంలో నడపాలి.
అధికారం శాశ్వతం కాదు. కానీ, అధికారంలో ఉన్నప్పుడు ప్రజలకు చేసిన సేవలు చరిత్ర పుటల్లో చిరస్మరణీయంగా నిలిచిపోతాయి. నాడు ‘అన్నమో రామచంద్రా’ అంటూ కరువుతో అల్లాడిన తెలంగాణ నేల నేడు పచ్చగా కళకళలాడుతున్నది. మొత్తంగా చెప్పాలంటే కష్టాల్లో ఉన్న రైతుకు ధైర్యం ముఖ్యమంత్రి కేసీఆర్. ఆకలి కడుపునకు సద్దిబువ్వ మన కేసీఆర్. రాబోయే రోజుల్లో దేశ రైతుల దశ మార్చబోయేది కూడా ముఖ్యమంత్రి కేసీఆరే… అందుకే ఆయన ‘అబ్ కీ బార్ కిసాన్ సర్కార్’ అనే నినాదాన్ని ఎత్తుకున్నారనడంలో సందేహం లేదు.
– తెలంగాణ విజయ్