దేశంలో కరోనా వైరస్ కేసుల్లో మళ్లీ పెరుగుదల కనిపిస్తోంది. గత కొన్ని రోజులుగా అదుపులోనే ఉందనుకున్న మహమ్మారి మరోసారి కోరలు చాస్తోంది. తాజాగా కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించిన వివరాల ప్రకారం.. గత 24 గంటల్లో 44,225 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా 918 కొత్త కేసులు బయటపడ్డాయి. దీంతో దేశంలో మొత్తం యాక్టివ్ కేసుల సంఖ్య 6,350కి చేరింది. ఇక గత 24 గంటల్లో నలుగురు మృతిచెందగా.. మొత్తం మరణాల సంఖ్య 5,30,806కి చేరింది. ఇక దేశ వ్యాప్తంగా ఇప్పటి వరకు 220.65 కోట్ల కరోనా వ్యాక్సిన్ డోసులు పంపిణీ చేసినట్లు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది. ఇదిలా ఉండగా.. ఆదివారం ఒక్కరోజే 1,000కి పైగా కొత్త కేసులు నమోదైన విషయం తెలిసిందే. ఈ పరిస్థితి 129 రోజుల తరువాత ఇదే తొలిసారి.