అంతర్జాతీయ మహిళా దినోత్సవం పురస్కరించుకొని ఆరోగ్య మహిళా పథకాన్ని రాష్ట్ర వైద్యారోగ్య ,ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు ఈరోజు బుధవారం కరీంనగర్ జిల్లాలో ప్రారంభించారు.
ఈ సందర్భంగా మంత్రి హరీశ్‌రావు మాట్లాడుతూ.. మహిళల కోసం ఆరోగ్య మహిళ అనే కొత్త పథకాన్ని తీసుకొచ్చామని తెలిపారు. ఆరోగ్య మహిళ పథకంలో 8 రకాల చికిత్సలు అందుబాటులో ఉంటాయన్నారు. ఈ పథకం కింద 100 ఆస్పత్రులు ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. ఆరోగ్య మహిళా కేంద్రాల్లో మహిళా సిబ్బంది మాత్రమే ఉంటారని మంత్రి స్పష్టం చేశారు.
మహిళల సంక్షేమ కోసం ఆరోగ్య లక్ష్మి, కల్యాణలక్ష్మి, కేసీఆర్ కిట్ వంటి ఎన్నో కార్యక్రమాలు చేపట్టామని తెలిపారు. మహిళల భద్రత కోసం దేశంలో ఎక్కడా లేని విధంగా షీ టీమ్స్ ఏర్పాటు చేశామన్నారు. మిషన్ భగీరథ పథకం అమలు చేసి ఆడబిడ్డలకు నీటి కష్టాలు తీర్చామని మంత్రి హరీశ్‌రావు స్పష్టం చేశారు.
8 రకాల చికిత్సలు ఇవే..
- మధుమేహం, రక్తపోటు, రక్తహీనత, ఇతర సాధారణ పరీక్షలు
- ఓరల్, సర్వైకల్, రొమ్ము క్యాన్సర్ల స్క్రీనింగ్..
- థైరాయిడ్ పరీక్ష, సూక్ష్మ పోషకాల లోపాలను గుర్తించడం. అయోడిన్ సమస్య, ఫోలిక్ యాసిడ్, ఐరన్ లోపంతో పాటు, విటమిన్ బీ12, విటమిన్ డి పరీక్షలు చేసి చికిత్స, మందులు అందజేస్తారు.
- మూత్రకోశ సంబంధిత ఇన్ఫెక్షన్లు, పెల్విక్ ఇన్ఫ్లమేటరీ వ్యాధుల పరీక్షలు చేస్తారు.
- మోనోపాజ్ దశకు సంబంధించి పరీక్షల అనంతరం అవసరమైన వారికి హార్మోన్ రీప్లేస్మెంట్ థెరపీ చేయడంతోపాటు కౌన్సిలింగ్‌తో అవగాహన కలిగిస్తారు.
- నెలసరి సమస్యలపై పరీక్షలు చేసి వైద్యం అందిస్తారు. సంతాన సమస్యలపై ప్రత్యే కంగా పరీక్షలు చేసి అవగాహన కలిగించడం, అవసరమైనవారికి ఆల్ట్రాసౌండ్ పరీక్షలు చేస్తారు.
- సెక్స్ సంబంధిత అంటువ్యాధుల పరీక్షలు చేసి అవగాహన కలిగిస్తారు. అవసరమైన వారికి వైద్యం అందిస్తారు.
- బరువు నియంత్రణ, యోగా, వ్యాయామం వంటివాటిపై అవగాహన కలిగిస్తారు.