అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని రాష్ట్రంలోని పట్టణాల్లో మహిళా వారోత్సవాలను ఘనంగా నిర్వహించనున్నట్లు పురపాలక శాఖ మంత్రి కేటీరామారావు తెలిపారు.
మహిళా దినోత్సవం సందర్భంగా సమాజంలో మహిళల శక్తిని, పాత్రను సెలబ్రేట్ చేసేలా ఈ ఉత్సవాలు నిర్వహించాలని, ఇందుకు సంబంధించి అవసరమైన కార్యాచరణను రూపొందించాలని పురపాలక శాఖ అధికారులను ఆదేశించారు. ఈనేపథ్యంలో మహిళా వారోత్సవాలను నిర్వహించేందుకు పురపాలక శాఖ కార్యాచరణను ప్రకటించింది.
మార్చి 8న మహిళా దినోత్సవం రోజున ప్రారంభమయ్యే ఈ వారోత్సవాల్లో వివిధ కార్యక్రమాలను నిర్వహించనున్నది. పురపాలికల్లో వివిధ హోదాలలో ప్రాతినిథ్యం వహిస్తున్న మహిళా ప్రజాప్రతినిధులు, పురపాలక శాఖ సిబ్బంది, స్వయం సహాయక సంఘాలు సభ్యులు, పారిశుద్ధ్య కార్మికులు, వివిధ ఎన్జీవోల సిబ్బందితో ఈ మహిళా దినోత్సవ వారోత్సవాలను నిర్వహించనున్నట్లు తెలిపింది.