RAITHU BHAROSA: నాలుగో ఏడాదికి సంబంధించి వైఎస్ ఆర్ రైతు భరోసా నిధులను ముఖ్యమంత్రి జగన్ విడుదల చేశారు. గుంటూరు జిల్లా తెనాలిలో రైతు భరోసా నిధులను విడుదల చేశారు. రైతు బాగుంటేనే రాష్ట్రంల బాగుంటుందని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. మేనిఫెస్టోలో చెప్పిన దానికంటే ఎక్కువగానే ప్రజలకు మేలు చేశామని వెల్లడించారు.
రైతులకు ఏటా 13500 రూపాయలు అందిస్తున్నామని సీఎం ప్రస్తావించారు. తుపాను వల్ల నష్టపోయిన రైతులకు ఇన్ పుట్ సబ్సిడీ అందిస్తున్నామని వెల్లడించారు. రైతన్నలపై మమకారం అంటే ఇది అని ముఖ్యమంత్రి వ్యాఖ్యానించారు. ఏ సీజన్ లో పంట నష్టం జరిగితే…..ఆ సీజన్ ముగిసేనాటికి పరిహారం అందించనున్నామని తెలిపారు.
గత ప్రభుత్వం హయాంలో ఒక అన్యాయస్తుడు ముఖ్యమంత్రిగా ఉండేవారని సీఎం జగన్ ఎద్దేవా చేశారు. అతని హయాంలో మొత్తం కరవే తాండవించింది. 300 మండలాలను కరవు మండలాలుగా ప్రకటించిన పరిస్థితి వచ్చిందని తెలిపారు. కానీ ఈ నాలుగేళ్లలో దేవుడి చల్లని చూపుతో…….ఒక్క మండలం కూడా కరవు మండలంగా అవ్వలేదని గుర్తు చేశారు. కరవుకు కేరాఫ్ అడ్రస్ చంద్రబాబు అని ముఖ్యమంత్రి జగన్ అన్నారు. ఈ అన్యాయస్తుడు ఎప్పుడు ముఖ్యమంత్రి అయినా……కరవు కూడా అప్పుడు వస్తుందని ఎద్దేవా చేశారు. ఇది ఒక నగ్నసత్యం, గతాన్ని చూస్తే అందరికీ తెలుస్తుందని దుయ్యబట్టారు. ఈ నాలుగేళ్లలో దేవుడి దయతో రాష్ట్రంలో సమృద్ధిగా వర్షాలు కురిసాయని తెలిపారు. ఇలాంటి మంచి పరిపాలనకు దేవుడు కూడా సహకరించాడని సీఎం జగన్ పేర్కొన్నారు. ప్రతి గ్రామంలో ప్రతి చెరువు నిండిందని తెలిపారు. భూగర్భ జలాలన్నీ పెరిగాయని అన్నారు. చంద్రబాబుకు, దత్తపుత్రుడుకు సవాల్ విసురుతున్నా…..175 నియోజకవర్గాల్లో పోటీ చేసి గెలిచే ధైర్యముందా అని ప్రశ్నించారు. మా దగ్గర ఎవరూ లేకపోయినా……మా మంచి పనులే మాకు శ్రీరామరక్షగా మళ్లీ అధికారంలోకి వస్తామని ముఖ్యమంత్రి జగన్ వ్యాఖ్యానించారు.