దేశంలో త్వరలో పశువులకు కూడా ఆధార్ నంబర్ ఇవ్వనున్నట్టు నీతి ఆయోగ్ సభ్యుడు వీకే పాల్ తెలిపారు. పశువులకు వచ్చే పలు రకాల వ్యాధుల పుట్టుక గురించి వీలైనంత త్వరగా తెలుసుకోవాలని అప్పుడే దాని నివారణకు వ్యాక్సిన్‌ను, ఇతర మార్గాలను అన్వేషించడం సులభమవుతుందని ఆయన ఈ సందర్భంగా అన్నారు.
బయో ఏషియా సదస్సులో భాగంగా మొదటి రోజు ప్యానల్ డిస్కషన్లో ‘వన్ హెల్త్ అప్రోచ్, స్వదేశీ పరిజ్ఞానం, విధానం’ అంశంపై చర్చ నిర్వహించారు. దీనికి సీఎంసీ వెల్లూరు ప్రొఫెసర్ డాక్టర్ గగన్‌దీప్ కంగ్ సమన్వయకర్తగా వ్యవహరించారు.
ఈ సందర్భంగా వీకే పాల్ మాట్లాడుతూ.. మనుషులకు ఇచ్చినట్టుగానే పశువులకు పశు ఆధార్‌ను రూపొందించామని చెప్పారు. త్వరలో ప్రతి పశువు, జంతువుకు ఆధార్ నంబర్ ఇవ్వనున్నామని తెలిపారు. దీని ద్వారా దేశంలో పశువులు, జంతువుల వివరాలు సులభంగా లభ్యమవుతాయన్నారు. ఆ తరువాత ఆ వివరాలను డిజిటలైజ్ చేస్తామని చెప్పారు.