SAJJALA: వివేకా హత్యకేసులో అవినాష్ రెడ్డికి ఎలాంటి సంబంధం లేదని సజ్జల రామకృష్ణారెడ్డి స్పష్టం చేశారు. ఎన్నికల ముందు వివేకా హత్య కేసుతో జగన్ ను నైతికంగా, మానసికంగా దెబ్బతీసేందుకే తెదేపా ప్రయత్నించిందని తెలిపారు. అవినాష్ రెడ్డికి సంబంధమున్నట్లు ఎలాంటి ఆధారాలు లేవని గుర్తు చేశారు. బీటెక్ రవికి, ఆదినారాయణరెడ్డికి సంబంధమున్నట్లు తమ దగ్గర ఆధారాలున్నాయని తెలిపారు.
వివేకా పార్టీలోకి వస్తానంటే ఆహ్వానించింది జగనే అని సజ్జల వెల్లడించారు. అసలు వివేకాను కోల్పోవడం పార్టీకి, మాకే తీరని నష్టం కలిగించిందని తెలిపారు. వివేకా హత్యకేసు విచారణ సజావుగా సాగడం లేదని……కొందరిని మాత్రమే లక్ష్యంగా విచారణ చేస్తున్నారని దుయ్యబట్టారు. శివప్రకాశ్ రెడ్డి ఫోన్ చేసి వివేకా గుండెపోటుతో చనిపోయినట్లు తనకు చెప్పారని ఆదినారాయణ రెడ్డే చెప్పారని గుర్తు చేశారు. వివేకా బావమరిది శివప్రకాశ్ రెడ్డి ఫోన్ చేస్తేనే అవినాష్ రెడ్డి అక్కడకు వెళ్లారని తెలిపారు. వివేకా ఫోన్ లోని రికార్డులను ఎందుకు తీసేశారని సజ్జల ప్రశ్నించారు.
వివేకా హత్యకేసులో దర్శకత్వం, స్క్రీన్ ప్లే అంతా చంద్రబాబుదే అని సజ్జల వ్యాఖ్యానించారు. చంద్రబాబు హయాంలోనే వివేకా హత్య కేసు జరిగిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. సీబీఐ వెనుక కచ్చితంగా రాజకీయనేతల ప్రమేయం ఉందని సజ్జల తెలిపారు. శివశంకర్ రెడ్డి తప్పు లేదని మేం భావిస్తున్నామని వ్యాఖ్యానించారు. చంద్రబాబు గతంలో రాజశేఖర్ రెడ్డిపై ఫ్యాక్షనిస్టు అనే ముద్ర వేసి కుట్రలు చేశారని….ఇప్పుడు జగన్ పైనా కుట్రలు చేస్తున్నారని మండిపడ్డారు. చంద్రబాబు కథనాన్ని ప్రణాళిక ప్రకారం తయారు చేస్తారని….అదే విధంగా మీడియా ద్వారా ప్రచారం చేస్తారని విమర్శించారు.