దేశంలో ఉన్న ప్రభుత్వ రంగసంస్థలను తమ తాబేదారులకు కట్టబడుతుందని రాష్ట్ర విద్యుత్ శాఖామంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి ఆరోపించారు. అందుకు అనుగుణంగా తక్కువ ధరలకే ప్రభుత్వ రంగ సంస్థలను విక్రయిస్తున్నారని ఆయన మండిపడ్డారు. సూర్యాపేట కు చెందిన పలువురు కాంగ్రెస్ నేతలు శుక్రవారం ఉదయం మంత్రి జగదీష్ రెడ్డి సమక్షంలో బి ఆర్ యస్ లో చేరారు.ఈ సందర్భంగా మంత్రి జగదీష్ రెడ్డి మాట్లాడుతూ మోదీ పాలనలో వారి వారి అనుచరులకు ప్రభుత్వ ఆస్తులు దోచి పెట్టడం మినహా సామాన్య ప్రజలకు ఒరగ బెట్టింది ఏమి లేదంటూ ఘాటుగా విమర్శించారు.
దానికి తోడు విద్యుత్ రంగాన్ని ప్రైవేటికరించేందుకు రూట్ మ్యాప్ సిద్ధం చేసిందన్నారు.ప్రైవేటు సంస్థల డిమాండ్ మేరకే వ్యవసాయ పంపుసెట్లకు మీటర్లు బిగించాలంటూ కేంద్రం రాష్ట్ర ప్రభుత్వాల మీద ఒత్తిడి తెస్తుందన్నారు.ఇక్కడి బిజెపి గల్లీ నాయకులు అవగాహన లేక అజ్ఞానంతో తప్పుడు ప్రచారానికి దిగ జారుతున్నారని ఆయన దుయ్యబట్టారు. పెరిగిన డిమాండ్ కనుగుణంగా విద్యుత్ సరఫరాకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని ఆయన వెల్లడించారు. మార్చి నాటికి విద్యుత్ పిక్ డిమాండ్ 15000 మేఘావాట్లకు చేరుకుంటుందని భావిస్తే అందుకు భిన్నంగా ఇప్పటికే ఆ డిమాండ్ 15,000 మేఘవాట్లకు చేరుకుందన్నారు.
కేంద్రప్రభుత్వం, ఎన్. టి.పి.సి నిర్లక్ష్యం కారణంగానే విద్యుత్ సరఫరా లో కొంత అవరోధం ఏర్పడిందన్నారు.దానికి తోడు రెండు ప్లాంట్లు నిలిచి పోవడంతో కొంత ఇబ్బంది కలిగిందన్నారు. తక్షణం సమీక్షించిన ముఖ్యమంత్రి కేసీఆర్ ఎంత ధర అయినా చెల్లించి విద్యుత్ కొనుగోలు చేయాలంటూ ఇచ్చిన ఆదేశాలతో సమస్య సమిసి పోయిందని మంత్రి జగదీష్ రెడ్డి స్పష్టం చేశారు. వ్యవసాయ రంగంతో పాటు వాణిజ్య,వ్యాపార గృహ వినియోగదారులకు నిరంతర విద్యుత్ సరఫరాలో ఎటువంటి ఆటంకం ఉండబోదన్నారు.పెరుగుతున్న డిమాండ్ కనుగుణంగా విద్యుత్ కొనుగోలు చేసి సరఫరా చేసేందుకు అవసరమైన ట్రాన్స్ మిషన్ లైన్స్,ట్రాన్స్ఫార్మర్స్,డిస్ట్రిబ్యూటరీ లైన్స్,ట్రాన్స్ఫార్మర్స్ సిద్ధం చేసి పెట్టమన్నారు.తెలంగాణాలో వ్యవసాయ పంపు సెట్లకు మీటర్లు పెట్టె ప్రసక్తేలేదని ఆయన స్పష్టం చేశారు. కేంద్రం ఎంత వత్తిడి చేసిన మోటర్లకు మీటర్ల పెట్టబోము అంటూ నిండు సభలో రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ చెప్పిన మాటలను మంత్రి జగదీష్ రెడ్డి ఉటంకించారు.