యాదగిరీశుడి క్షేత్రంలో ప్రతి యేటా ఫాల్గుణ మాసంలో బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతాయి. ఉత్సవాలను మొదటగా సృష్టికర్త ప్రారంభించడంతో బ్రహ్మోత్సవాలు అన్న పేరు స్థిరపడింది. ఈ ఉత్సవాలతో స్వామిక్షేత్రం 11 రోజుల పాటు ముక్కోటి దేవతలకు విడిదిగా మారుతుందని అర్చకులు చెబుతున్నారు. బ్రహ్మోత్సవ వేళ యాదగిరి వేదగిరి అన్న ప్రాచీన నామాన్ని సార్థకం చేసుకుంటుంది. ఈ సందర్భంగా సకల దేవతలను శాస్ర్తోక్తంగా ఆహ్వానించి వేదోక్తంగా పూజలు నిర్వహించడం ఆలయ సంప్రదాయంగా వస్తున్నది. విశ్వక్సేన పూజలతో మొదలైన ఉత్సవాలు స్వయంభువులకు నిర్వహించే అష్టోత్తర శతఘటాభిషేకంతో బ్రహోత్సవాలకు ముగింపు పలుకుతారు. మొదట ధ్వజారోహణంలో మహావిష్ణువు వాహనమైన వేద స్వరూపుడు గరుత్మంతుడికి పూజలు నిర్వహిస్తారు. మూడో రోజు నుంచి స్వామివారి అలంకార సంబురాలు జరుపుతారు. ఏడు, ఎనిమిది, తొమ్మిది రోజుల్లో విశేష పర్వాలైన ఎదుర్కోలు, తిరుకల్యాణ మహోత్సవం, రథయాత్ర నిర్వహిస్తారు. పదో రోజున చక్రతీర్థ స్నానం జరుపుతారు.
నాడు భక్తోత్సవాలు.. నేడు బ్రహ్మోత్సవాలు మాత్రమే నిర్వహించేది. కాలక్ర మేణా ఐదు రోజులకు పెంచారు. గతంలో ఈ ఉత్సవాలు మార్గశిర మాసంలో జరిగేవి. అప్పట్లో కొంత మంది అర్చకులు ఫాల్గుణ శుద్ధ విధియ నుంచి ద్వాదశి వరకు 11 రోజులు నిర్వహించాలని ప్రణాళికలు రూపొందించారు. అప్పట్లో ఘాట్ రోడ్లు లేకపోవడంతోపాటు మెట్ల దారి అంతంత మాత్రంగానే ఉండేది. దీంతో భక్తులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొనేవారు. రాయగిరి వరకు వివిధ వాహనాల ద్వారా వచ్చి అక్కడి నుంచి టాంగాలు, ఎడ్ల బండ్ల సాయంతో వచ్చేవారు. గతంలో భక్తులు వందల సంఖ్యలో రాగా.. ఇప్పుడు వేలకు పెరిగింది. 1985లో యాదగిరిగుట్ట మండలం ఏర్పాటైంది. అంతకుముందు 1978 ప్రాంతంలో యాదగిరిగుట్ట ఆర్టీసీ బస్ డిపో ఏర్పాటు కావడంతో ప్రయాణం సులువైంది. ముఖ్యంగా మహారాష్ట్ర, కర్ణాటక రాష్ర్టాలతో పాటు మహబూబ్‌నగర్, హైదరాబాద్ ప్రాంతాలకు చెందిన భక్తులు స్వామివారి బ్రహ్మోత్సవాలకు వచ్చేది. మహారాష్ట్రకు చెందిన భక్తులు వారం రోజులు ఇక్కడే ఉండి స్వామివారి ఉత్సవాలు వీక్షించేవారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అనంతరం ముఖ్యమంత్రి కేసీఆర్ రూ.1,250 కోట్లు వెచ్చించి ఆలయాన్ని మహాద్భుతంగా తీర్చిదిద్దగా గతేడాది మార్చి 28న ప్రధానాలయం పునఃప్రారంభమైంది. సకల వసతులతో నిర్మించిన ఆలయంలో ఈ ఏడాది అంగరంగ వైభవంగా బ్రహ్మోత్సవాలు జరుగనున్నాయి.
అలంకార వాహనాలు ముస్తాబు
స్వామివారి బ్రహ్మోత్సవాల్లో అలంకార సేవలకు విశిష్టత ఉంది. స్వామివారు ఒక్కో రోజు ఒక్కో రూపంలో భక్తులకు దర్శనం ఇస్తారు. ఈ నెల 23నుంచి మార్చి 1వ తేదీ వరకు సాగే స్వామివారి అలంకార సేవలో వినియోగించే వాహనాలను ముస్తాబు చేశారు. మత్స్యావతారం, శేషావతారం, శ్రీకృష్ణాలంకారం (మురళీకృష్ణుడు), హంస వాహనం, వటపత్రశాయి, పొన్నవాహన, గోవర్ధనగిరిధారి, సింహవాహనం, జగన్మోహిణి, అశ్వవాహనం, హనుమంత వాహనం, గజవాహనం, గురుఢ వాహనాలను ముస్తాబు చేశారు. ఈ నెల 22న నిర్వహించే ధ్వజారోహణం కార్యక్రమానికి ధ్వజస్తంభం, బలిపీఠాలను సిద్ధం చేశారు.
స్వయంభువుల అనుమతితో ఉత్సవాలకు అంకురార్పణ
స్వయంభూ ప్రధానాలయం పునఃప్రారంభం అనంతరం తొలిసారిగా జరిగే ఉత్సవాలకు మంగళవారం ఉదయం స్వయంభూ నారసింహుడి అనుమతితో ప్రధానాలయ ముఖ మండపంలో స్వస్తివాచనంతో ఉత్సవాలకు శ్రీకారం చుట్టనున్నారు. ధ్వజస్తంభం ముందు భాగం, గర్భాలయం ఎదురుగా ఉత్సవాలను ప్రారంభించనున్నారు. ప్రభాత వేళ స్వామివారి నిత్యపూజల అనంతరం స్వామివారిని వజ్ర వైఢూర్యాలు, వివిధ పూలతో ఆస్థానం చేసి నవ కలశాభిషేకం, స్వస్తివాచనం, విష్వక్సేనపూజ, రక్షాబంధనం, మంత్రపుష్ప నీరాజనాలతో ఉత్సవాలకు శ్రీకారం చుట్టనున్నారు. సాయంత్రం మృత్సంగ్రహణం, అంకురారోపణం, వైదృశ్య కార్యక్రమాలు జరుగనున్నాయి.
నేటి నుంచి ఆర్జిత సేవలు రద్దు..యథావిధిగా దర్శనాలు
వార్షిక బ్రహ్మోత్సవాలను దృష్టిలో ఉంచుకుని నేటి నుంచి వచ్చే నెల 3వ తేదీ వరకు నిత్యకల్యాణం, బ్రహ్మోత్సవం, సుదర్శన నారసింహ హోమం, మొక్కు సేవలను రద్దు చేస్తున్నాం. స్వామివారి రాత్రి నివేదన అర్చన తదుపరి 8:15 నుంచి 9గంటల వరకు బలిహరణ, ఆరగింపు రద్దు చేశాం. 21వ తేదీ నుంచి మార్చి 3వ తేదీ సాయంత్రం వరకు భక్తులతో నిర్వహించే అర్చనలు, బాలభోగాలను నిలిపివేస్తున్నాం. 27 నుంచి మార్చి 1వ తేదీ వరకు అభిషేకం, అర్చనలు రద్దు చేయనున్నాం. స్వామివారి దర్శనాలు మాత్రం యథావిధిగా ఉంటాయి. బ్రేక్ దర్శనంతో పాటు ధర్మ, ప్రత్యేక దర్శనాలు కొనసాగుతాయి. భక్తులు గమనించి సహకరించాలి.– ఎన్.గీత, యాదగిరిగుట్ట దేవస్థానం ఈఓ
కనీవిని ఎరుగని రీతిలో ఉత్సవాలు
ముఖ్యమంత్రి కేసీఆర్ స్వామివారి దివ్యక్షేత్రాన్ని మహాద్భుతంగా తీర్చిదిద్దారు. ఆలయం పునఃప్రారంభమైన అనంతరం తొలిసారిగా జరిగే బ్రహ్మాండనాయకుడి బ్రహ్మోత్సవాలను కనీవిని ఎరుగని రీతిలో నిర్వహిస్తాం. ఇందుకోసం వివిధ ప్రాంతాల నుంచి వంద మంది రుత్వికులు, పారాయణందారులు, ఆచార్యులు, పండితులు, అర్చకులను ఆహ్వానించాం. అర్చకుల మంత్రోచ్ఛరణలు, వేద పండితుల చతుర్వేద పారాయణందార్లు, రుత్వికుల ప్రబంధ పారాయణాలతో ఆలయంలో స్వామివారి బ్రహ్మోత్సవాలను చరిత్రలో నిలిచిపోయే విధంగా నిర్వహిస్తాం.– నల్లన్‌థీఘళ్ లక్ష్మీనరసింహాచార్యులు, ప్రధానార్చకుడు
ఉత్సవాలకు ఏర్పాట్లు పూర్తి
యాదగిరీశుడి ఉత్సవాలను గతం కంటే అద్భుతంగా నిర్వహించేందుకు ప్రభుత్వం రూ.1.50 కోట్లు కేటాయించగా అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. స్వామివారి ప్రధానాలయంతో పాటు ఆలయ ప్రాంగణమంతా రంగురంగుల విద్యుద్దీపాలతో దేవాలయం ఉత్సవ శోభను సంతరించుకున్నది. స్వామివారి సేవలను వినియోగించే వాహనాలను సిద్ధం చేశారు. ప్రధానాలయాన్ని శుద్ధి చేసి రంగురంగుల పూలతో అలంకరించారు. వివిధ పూజా కైంకర్యాలు చేపట్టేందుకు ప్రధానాలయం వెలుపలి ప్రాకార మండపంలోని అద్దాల మండపం ఎదురుగా యాగశాలను ఏర్పాటు చేశారు. వేసవి కాలం ప్రారంభం కావడంతో చలువ పందిళ్లు, తాగునీటి వసతులు కల్పించారు. స్వామివారి ఆలయాన్ని మామిడి తోరణాలు, వివిధ రకాల పూలతో అలంకరించారు. బ్రహ్మోత్సవాల కార్యక్రమాలు యాదగిరిగుట్ట అంతా ప్రతిధ్వనించేలా ప్రత్యేక సౌండ్ సిస్టం ఏర్పాటు చేశారు.