Minister Jagadeesh: కేంద్ర భాజపా చర్యలు….ప్రజల నడ్డి విరిచేటట్లు ఉన్నాయని మంత్రి జగదీశ్ రెడ్డి విమర్శించారు. కేంద్రపభుత్వ నిర్వాకాలను దేశంలో ప్రతి వ్యక్తి గమనిస్తున్నారని తెలిపారు. ఉచిత విద్యుత్, పేదలకు ఉచితాలు, రైతుల మోటర్లకు మీటర్లు వంటి అంశాలను సైతం దేశ భక్తిగా చిత్రీస్తూ దేశ ప్రజలను మోసం చేస్తున్నారని మంత్రి జగదీశ్ రెడ్డి మండిపడ్డారు.
ముఖ్యమంత్రి కేసీఆర్ అసెంబ్లీ వేదికగా ప్రశ్నలు సంధిస్తే….దానికి కూడా సమాధానం చెప్పలేక నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నారని విమర్శించారు. చిత్తశుద్ధి లేని భాజపాకు …..నిజం మాట్లాడే సత్తా లేదని స్పష్టం చేశారు. దమ్ముంటే మోటర్లకు మీటర్లపై వివరణ ఇవ్వాలని డిమాండ్ చేశారు.
50 రూపాయలకు యూనిట్ చొప్పున విద్యుత్ అమ్ముకోవచ్చని చెప్పిన కేంద్రానికి సిగ్గుందా అని మంత్రి జగదీశ్ ప్రశ్నించారు. దేశంలో ఎవరైనా 50 రూపాయలు పెట్టి కొనగలరా అని ప్రశ్నించారు. ప్రజలకు మోదీ, కేంద్ర సర్కారు నిజస్వరూపం తెలిసిపోయిందని అన్నారు. భాజపాకు ప్రజలకు తగిన గుణపాఠం చెప్తారని….అందుకు సిద్ధంగా ఉన్నారని విమర్శించారు.
తాము ఉచిత విద్యుత్, మోటర్లకు మీటర్లు బిగించే విషయంలో స్పష్టంగా అసెంబ్లీలోనే వివరించామని గుర్తు చేశారు. రాష్ట్రాల మెడపై కత్తి పెట్టి మోటర్లు బిగించేలా కేంద్రం ఒత్తిడి చేస్తుందంటూ ఆధారాలతో సైతం చూపించామని తెలిపారు. మోటర్లకు మీటర్లు బిగిస్తామని కేంద్రానికి ఏదో లేఖ రాసినట్లు బండి సంజయ్ నిత్యం అర్థం లేని విధంగా మాట్లాడుతున్నారని తెలిపారు. అసలు బండి చెప్పే మాటలను కేంద్ర విద్యుత్ శాఖ మంత్రి సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. కేంద్ర మంత్రి ఇచ్చిన ప్రతి జీవోలోనూ ఏ రాష్ట్రమైనా అన్ని కనెక్షన్లకు మీటర్లు పెడితేనే ఎఫ్‌ఆర్‌బీఎం పరిమితి 0.5 శాతం పెంచుతామని ఉత్తర్వులు ఇచ్చింది వాస్తవం కాదా అని మంత్రి జగదీశ్ రెడ్డి ప్రశ్నించారు.