GOVERNOR: గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ వీడ్కోలు సమావేశంలో ముఖ్యమంత్రి ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. సీఎం జగన్ తనపై చూపిన ప్రేమ, అప్యాయత ఎప్పటికీ మరువలేనిదని గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ అన్నారు. ఇక్కడి నుంచి వెళ్లిపోవడానికి మనసు రావడం లేదని….కానీ పరిస్థితుల వల్ల వెళ్లకతప్పడం లేదని గవర్నర్ అన్నారు.
రాష్ట్రం కోసం, ప్రజల ప్రయోజనాల కోసం ఎన్నోసార్లు ముఖ్యమంత్రి గారు చర్చించారని తెలిపారు. రాష్ట్ర సీఎం, గవర్నర్ మధ్య సత్సంబంధాలు ఎంతో ముఖ్యమైనవని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి జగన్ ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశ పెట్టారు. ఆంధ్రప్రదేశ్ నా రెండో ఇళ్లు అని వ్యాఖ్యానించారు. ప్రాణమున్నంత వరకు ఏపీ ప్రజలను మరువలేనని అన్నారు.
నాకు ఎన్నో సార్లు అనుమానం కలిగింది…ఎలా ఇన్ని పథకాలు అమలు చేస్తారని. అలానే ఒకసారి అడిగా ముఖ్యమంత్రిని ఎలా సంక్షేమ పథకాలు అమలు చేస్తారని. దేవుడి దయతో అన్నీ సాధ్యమవుతాయని ముఖ్యమంత్రి చెప్పారని తెలిపారు. రైతు భరోసా కేంద్రాలు దేశానికే ఆదర్శంగా నిలిచాయని తెలిపారు. సాగు రంగంలో అన్ని రాష్ట్రాలకంటే ముందుందని వెల్లడించారు. ప్రజలు కూడా అంతే ప్రేమతో పూర్తి సహకారం అందించారని తెలిపారు.
కొవిడ్ సమయంలోనూ ప్రభుత్వం, స్వచ్ఛంద సంస్థలు, వైద్యులు ప్రాణాలకు తెగించి పోరాటం చేశారని గుర్తు చేశారు. ముఖ్యమంత్రి జగన్ ను ఎప్పుడూ నా కుటుంబసభ్యుడిలా భావిస్తున్నాని అన్నారు. రాష్ట్ర ప్రజల కోసం సీఎం జగన్ కృషి మరువలేనిదని అన్నారు.