టీఎస్ఆర్టీసీ తొలిసారిగా ఏసీ స్లీపర్ బస్సులను ప్రవేశపెట్టేందుకు సిద్ధం అవుతోంది. మార్చి నుంచి 16 బస్సులు ప్రయాణికులకు అందుబాటులోకి రానున్నాయి. నమూనా బస్సు సోమవారం హైదరాబాద్‌లోని బస్‌భవన్ ప్రాంగణానికి రాగా, ఆర్టీసీ ఎండీ సజ్జనార్, ఈడీ (ఆపరేషన్స్) పీవీ మునిశేఖర్‌లు పరిశీలించారు. దూరప్రాంతాలకు, ముఖ్యంగా రాత్రి ప్రయాణాలు చేసేవారికి ఈ బస్సులు సౌకర్యంగా ఉంటాయి.
ప్రైవేటు ఆపరేటర్లు ఇప్పటికే హైదరాబాద్ నుంచి పొరుగు రాష్ట్రాలకు భారీ సంఖ్యలో ఏసీ స్లీపర్ బస్సులను నడుపుతున్నారు. కొద్దిరోజుల క్రితం నాన్ ఏసీ స్లీపర్ కమ్ సీటర్ బస్సులను టీఎస్ఆర్టీసీ రోడ్డు ఎక్కించింది. నాన్ ఏసీ స్లీపర్ బస్సుల మాదిరే ఏసీ స్లీపర్ బస్సులకూ లహరి అని నామకరణం చేసింది.
ఈ బస్సులను హైదరాబాద్ నుంచి పొరుగు రాష్ట్రాల్లోని విశాఖపట్నం, తిరుపతి, బెంగళూరు, చెన్నై, హుబ్బళ్లి నగరాలకు నడిపించనున్నట్లు ఎండీ సజ్జనార్ తెలిపారు. వీలైనంత త్వరగా ఏసీ స్లీపర్ బస్సులను ప్రయాణికులకు అందుబాటులోకి తేవాలని అధికారుల్ని ఆదేశించారు. కార్యక్రమంలో ఆర్టీసీ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ (సీఓఓ) వి.రవీందర్, చీఫ్పర్సనల్ మేనేజర్ కృష్ణకాంత్, అధికారులు రఘునాథరావు, జీవన్‌ప్రసాద్‌లు పాల్గొన్నారు.
లహరి ఏసీ బస్సు ప్రత్యేకతలు
* మొత్తం 30 బెర్త్‌లు ఉంటాయి. కింద 15, పైన 15. బస్సు పొడవు 12 మీటర్లు.
* ప్రతి బెర్త్‌కు సెల్‌ఫోన్ ఛార్జింగ్ సదుపాయం. నీళ్ల సీసా పెట్టుకునే ఏర్పాటు.
* వెహికిల్ ట్రాకింగ్ సిస్టమ్. పానిక్ బటన్.
* వైఫై సదుపాయం.
* భద్రత కోసం రెండు సీసీ కెమెరాలు
* గమ్యస్థానం వివరాలతో బస్సు ముందు, వెనుక ఎల్ఈడీ బోర్డులు.
* అగ్ని ప్రమాదాలను ముందే గుర్తించి నివారించేందుకు ఫైర్ డిటెక్షన్ సప్రెషన్ సిస్టమ్.