YCP: భాజపా నేతల వ్యాఖ్యలపై వైకాపా నేతలు, మంత్రులు ఒకరితర్వాత ఒకరు ఘాటు వ్యాఖ్యాలతో సంధిస్తున్నారు. భాజపా నీచ రాజకీయాలు చేస్తోందని విమర్శిస్తున్నారు.
తాజాగా మాజీ మంత్రి కన్నబాబు కూడా సోము వీర్రాజుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. హిందుత్వంపైన ఒక్క భాజపాకేనా ప్రేముంది…మాకు లేదా అని కన్నబాబు ప్రశ్నించారు. చంద్రబాబు హయాంలో దేవాలయాలను కూల్చినప్పుడు రాని కోపం…ఇప్పుడు ఎందుకొస్తుందో చెప్పాలని డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రి జగన్ అన్ని మతాలను, ఆచారాలను గౌరవిస్తారని అన్నారు. తిరుమలలో తొలి దర్శన భాగ్యం యాదవులకు కలిగేలా చర్యలు పునరుద్ధరించారని గుర్తు చేశారు.
భాజపా మతాలను అడ్డు పెట్టుకుని రాజకీయాలు చేస్తోందని కన్నబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు ప్రభుత్వంలో దాదాపు 40 ఆలయాలను కూలగొట్టినప్పుడు భాజపా నేతలు ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. సునీల్ దియోదర్ వంటి నేతల్ని అడ్డుపెట్టుకుని రాజకీయాలు చేస్తే ఇంకా దిగజారిపోతారని మండిపడ్డారు.
కాగా….కులాలు, మతాల మధ్య చిచ్చు పెట్టడం భాజపా మానుకోవాలని మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ అన్నారు. మానవ సేవే మాధవ సేవ అని భాజపా నేతలకు తెలియదా అని ప్రశ్నించారు. భాజపాకు ఏపీలో రాజకీయాలు సాధ్యం కావని విమర్శించారు. ఏపీలో ముఖ్యమంత్రి పాలన అద్భుతంగా ఉందని వెల్లంపల్లి అన్నారు. కావాలనే ప్రజల మధ్య వైషమ్యాలు రెచ్చగొడుతున్నారని మండిపడ్డారు.