MINISTER NIRANJANREDDI: వనపర్తిలో సంత్ సేవాలాల్ మహరాజ్ జయంతి వేడుకలలో మంత్రి నిరంజన్ రెడ్డి పాల్గొన్నారు. కేసీఆర్ ప్రభుత్వం సాగునీటి రంగానికి గొప్ప ప్రాధాన్యత ఇస్తోందని మంత్రి నిరంజన్ రెడ్డి అన్నారు. ముఖ్యమంత్రి KCR కృషివల్లే రాష్ట్రంలో నీటిమట్టం గణనీయంగా పెరిగిందని మంత్రి వ్యాఖ్యానించారు.
వనపర్తికి సాగునీటి రాకతో సాగు ఉత్పత్తులు పెరిగాయని మంత్రి అన్నారు. రాష్ట్రంలో సన్న, చిన్నకారు రైతుల చేతుల్లో 92.5 శాతం భూమి ఉందన్నారు. అంతేకాకుండా గిరిజనుల చేతిలో 19 లక్షల ఎకరాల భూమి ఉందని మంత్రి అన్నారు. తెలంగాణ ప్రభుత్వ చర్యలతో ప్రతి ఎకరాకు సాగునీరు అందుతుందని తెలిపారు. గిరిజనుల సమావేశాలు, సామూహిక కార్యక్రమాల కోసం సేవాలాల్ మహరాజ్ భవనాన్ని ప్రభుత్వం ఏర్పాటు చేసిందని మంత్రి వెల్లడించారు.
ఇచ్చిన మాట ప్రకారం తండాలను పంచాయతీలుగా మార్చిన ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్‌కే దక్కుతుందని మంత్రి వెల్లడించారు. ప్రతి తండాకు నూతన గ్రామపంచాయతీ భవనాలు, బీటీ రహదారుల నిర్మాణాలు జరుగుతున్నాయని వెల్లడించారు.
రాష్ట్ర విభజన జరిగాక తెలంగాణలో అభివృద్ధి, సంక్షేమంలో గొప్ప మార్పు వచ్చిందని మంత్రి నిరంజన్ రెడ్డి పేర్కొన్నారు. 75 ఏళ్లలో సాధ్యంకానిది సీఎం కేసీఆర్ దూరదృష్టితో తీసుకుంటున్న కార్యక్రమాల వల్ల మార్పు సాధ్యమవుతుందని వెల్లడించారు. రాష్ట్రంలో అన్ని రకాలుగా అభివృద్ధి చెందామని మంత్రి గుర్తుచేశారు. కేసీఆర్ కృషి వల్ల ఇదంతా సాధ్యమైందని కొనియాడారు.