MINISTER SRINIVAS: మహాశివరాత్రి సందర్భంగా మహబూబ్ నగర్ జిల్లా వీరన్నపేట పెద్ద శివాలయంలో స్వామివారిని మంత్రి శ్రీనివాస్ గౌడ్ దర్శించుకున్నారు. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం ప్రాజెక్టుకు పచ్చజెండా ఊపడంపై మంత్రి స్పందించారు.
ఎన్ని అడ్డంకులు వచ్చినా….పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం పూర్తి చేసి తీరుతామని మంత్రి స్పష్టం చేశారు. ప్రాజెక్టు పూర్తైతేనే ఈ ప్రాంతానికి న్యాయం జరుగుతుందని అన్నారు. కరవు ప్రాంతాన్ని అభివృద్ధి చేసేందుకు ప్రాజెక్టు అత్యవసరమని మంత్రి అన్నారు. సాగునీటి లభ్యత పెరిగితే జిల్లా తీరుతెన్నులు మారుతాయని అన్నారు.
ఇప్పటికే ఉమ్మడి జిల్లాలో పెండింగ్ ప్రాజెక్టులను పూర్తి చేయడం వల్ల లక్షల ఎకరాల్లో పంటలు పండుతున్నాయని మంత్రి తెలిపారు. కేఎల్ఐ ప్రాజెక్టు ద్వారా ఎండాకాలంలో కూడా వాగుల్లో నీళ్లు పుష్కలంగా ప్రవహిస్తున్నాయని మంత్రి పేర్కొన్నారు.
రాష్ట్రంలో అన్ని హామీలను కేసీఆర్ నెరవేరుస్తున్నారని మంత్రి అన్నారు. ఆయన వల్ల రాష్ట్రంలో ఎన్నో ప్రాజెక్టులు పూర్తి అయ్యాయని గుర్తు చేశారు. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు ఏర్పడితే…..ప్రజల కష్టాలు తీరుతాయని మంత్రి అన్నారు. కచ్చితంగా పాలమూరు ప్రాజెక్టును కూడా పూర్తి చేసి అన్నదాతకు అండగా నిలుస్తామని తెలిపారు. కేసీఆర్ నాయకత్వంలో అన్ని అభివృద్ధి కార్యక్రమాలు మంచిగా జరుగుతున్నాయని అన్నారు. అతని సారథ్యంలో ప్రాజెక్టులే కాదు…సంక్షేమ పథకాలు పూర్తి స్థాయిలో అమలవుతున్నాయని అన్నారు.