HARISH RAO: తెలంగాణ పట్ల కేంద్ర ప్రభుత్వమెప్పుడూ అన్యాయమే చేస్తోందని మంత్రి హరీశ్ రావు వ్యాఖ్యానించారు. అన్ని విషయాల్లోనూ కేంద్రప్రభుత్వం సవతి ప్రేమ చూపిస్తుందని మండిపడ్డారు. వైద్య కళాశాల విషయంలోనూ అన్యాయం చేస్తోందని అన్నారు. తెలంగాణకు రావాల్సిన నిధులను ఇవ్వకుండా కేంద్రం ఇబ్బందులకు గురిచేస్తోందని విమర్శించారు.
కేంద్రం ప్రతిసారీ ప్రవేశపెట్టె బడ్జెట్‌లో ఏమీ ఉండదని విమర్శించారు. అదంతా ఒక బూటకమని…. డొల్ల అని మంత్రి హరీశ్ రావు ఎద్దేవా చేశారు. పేదల కోసం ఒక్క అంశమైనా ఉంటే చూపించాలని ప్రశ్నించారు. అలాంటివేమీ కేంద్ర బడ్జెట్ లో ఉండవని విమర్శించారు. కాకపోతే కార్పొరేట్‌లకు పన్నులు తగ్గించారని ఎద్దేవా చేశారు. రైతులు, మహిళలు, కుల వృత్తుల గురించి ఒక్క అంశం కూడా బడ్జెట్‌లో లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఖమ్మం, కరీంనగర్‌కు వైద్య కళాశాలలు ఇవ్వబోమని కేంద్రం చెప్పడం అన్యాయమన్నారు. వైద్య కళాశాలలు ఇవ్వలేని కేంద్ర భాజపాకు ఎందుకు ఓట్లు వేయడం దండగ అని మండిపడ్డారు. అలాంటి కేంద్రానికి ఓటు వేసేందుకు ప్రజలు ఇకనుంచి ఆలోచిస్తారని అన్నారు. కేంద్రం ప్రభుత్వం లక్షల కోట్ల అప్పులు తెచ్చి అభివృద్ధి చేయకపోగా వడ్డీలు కడుతోందని విమర్శించారు. తెలంగాణలో అప్పులు పెరగడానికి కేంద్రమే కారణమని ఆరోపించారు.
డీడీ డైలాగ్ పేరుతో హైదరాబాద్‌లో దూరదర్శన్ నిర్వహించిన ప్రోగ్రామ్‌లో పాల్గొన్న కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్…. తెలంగాణ గురించి అన్నీ అబద్ధాలు మాట్లాడారని మండిపడ్డారు. అసెంబ్లీలో ముఖ్యమంత్రి కేసీఆర్ మాట్లాడింది సత్యమని అన్నారు. తెలంగాణపై ప్రేముంటే వైద్య కళాశాలలు మంత్రి హరీశ్ రావు డిమాండ్ చేశారు. రాష్ట్రానికి రావాల్సిన 1.25 లక్షల కోట్ల రూపాయలు విడుదల చేయాలని కోరారు.