తెలంగాణలో టీఎస్ ఎంసెట్ (ఇంజినీరింగ్, ఫార్మసీ) నోటిఫికేషన్ తేదీ ఖరారు అయింది. వచ్చే నెల మార్చి మొదటి వారంలో విడుదల కానున్నది. దరఖాస్తుల స్వీకరణ కూడా మార్చి నుంచే ప్రారంభించనున్నారు.
ఇందుకు సంబంధించిన కసరత్తును జేఎన్టీయూ ముమ్మరం చేసింది. మే 7 నుంచి 14 వరకు ఎంసెట్ నిర్వహించాలని ఇప్పటికే నిర్ణయించిన విషయం విదితమే. మే 7 నుంచి 11 వరకు ఇంజినీరింగ్ విద్యార్థులకు, మే 12 నుంచి 14 వరకు అగ్రికల్చర్, ఫార్మసీ విద్యార్థులకు పరీక్షలు నిర్వహించాలని నిర్ణయించారు.
ఈ నేపథ్యంలో నోటిఫికేషన్ విడుదల, దరఖాస్తుల స్వీకరణ ఏర్పాట్లపై జేఎన్టీయూ తలమునకలైంది. ఎంసెట్‌లో ఇంటర్ వెయిటేజీ అమలు, కనీసం 45 శాతం మార్కులొచ్చి ఉండాలన్న నిబంధనలను సడలించడమా.. లేదా కొనసాగించడమా అన్న అంశంపై ప్రభుత్వానికి లేఖ రాశారు. ప్రభుత్వ స్పందనను బట్టి వీటి అమలుపై స్పష్టత రానున్నది.