PUNJAB CM: తెలంగాణ దేశానికే ఆదర్శంగా నిలిచిందని పంజాబ్ సీఎం భగవంత్ సింగ్ మాన్ కొనియాడారు. ప్రభుత్వం చేపట్టిన సాగునీటి పథకాలు, సంక్షేమం బాగున్నాయని ప్రశంసించారు. రాష్ట్రంలో భూగర్భ జలాల వనరులు, పథకాల నిర్వహణ, తాగు–సాగునీటి అంశాలపై అధ్యయనం చేసేందుకు పంజాబ్ సీఎం హైదరాబాద్ విచ్చేశారు.
సీఎం నేతృత్వంలోని అధికారుల బృందం సిద్దిపేట జిల్లాలో పర్యటించింది. కొండపోచమ్మ సాగర్‌తో పాటు గజ్వేల్‌లోని పాండవుల చెరువును పరిశీలించారు. రాష్ట్ర ఇరిగేషన్ శాఖ స్పెషల్ సీఎస్ రజత్ కుమార్‌తో నీటిపారుదలశాఖ అధికారులు కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణ పనులు, ప్రాజెక్టు నిర్మాణం తీరు, వివిధ దశలను వివరించారు.
అనంతరం కేసీఆర్ దత్తత గ్రామం ఎర్రవల్లి, నర్సన్నపేటలలో ప్రతిష్టాత్మకంగా నిర్మించిన 2 పడక గదుల ఇళ్లను పరిశీలించి అభినందించారు. రాష్ట్రంలో భూగర్భ జలాల పెంపునకు శ్రీకారం చుట్టిన కార్యక్రమాలు…. తక్కువ వ్యవధిలోనే సత్ఫలితాలు ఇచ్చాయని పేర్కొన్నారు. అలాంటి మంచి కార్యక్రమాలను పంజాబ్ లోనూ అమలు చేస్తామని తెలిపారు. పంజాబ్ లో క్రమేణా భూగర్భ జలాలు అడుగంటిపోతున్నాయని అన్నారు.
పాండవుల చెరువు కట్టపై ఏర్పాటుచేసిన మినీ ట్యాంక్ బండ్లను పరిశీలించారు. పంజాబ్ సీఎం, అధికారుల బృందం రాష్ట్రంలో క్షేత్రస్థాయిలో అధ్యయనం చేస్తోంది. పాండవుల చెరువు పునరుద్ధరణ పనులను అధికారులు పంజాబ్ సీఎంకు వివరించారు.
పంజాబ్‌లోని నీటిని కాపాడేందుకు నూతన సాంకేతిక పరిజ్ఞానం కోసం నీటిపారుదల శాఖ అధికారులతో కలిసి తెలంగాణ డ్యామ్‌ను పరిశీలించేందుకు వచ్చినట్లు పంజాబ్ సీఎం భగవంత్ సింగ్ మాన్ ట్వీట్ చేశారు.