RACHAMALLU: ప్రొద్దుటూరు ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి సీబీఐ మెట్లెక్కారు. విశాఖలోని సీబీఐ కార్యాలయంలో వినతిపత్రం అందించారు. తెదేపా నేతలు, నారా లోకేశ్ తనపై ఆరోపణలు చేశారని తెలిపారు. సీబీఐ విచారణకు సిద్ధమా అని నారా లోకేశ్ సవాల్ విసిరారని అందుకే సీబీఐ కార్యాలయానికి వచ్చినట్లు తెలిపారు.
ఓ మహిళా నేతతో దిగిన ఫోటో వైరల్ కావడంతో తెదేపా ఆరోపణలు చేయడం దారుణమన్నారు. విశాఖలోని సీబీఐ కార్యాలయంలో ముందుగా ఎస్పీని కలిసి వినతిపత్రం అందజేశారు. తెదేపా నిర్వాకం వల్లే సీబీఐ మెట్లు ఎక్కాల్సిన కర్మ పట్టిందని దుయ్యబట్టారు.
లోకేష్, ప్రొద్దుటూరు నేతలు తనపై చేసిన ఆరోపణలపై విచారణ జరిపించాలని సీబీఐని కోరారు. తాను దొంగనోట్లు ముద్రిస్తున్నానని, లిక్కర్ మాఫియా, మట్కా, జూదం, క్రికెట్ బెట్టింగ్‌లు చేస్తున్నానని తెదేపా ఆరోపించిందని తెలిపారు. వచ్చిన డబ్బులతో రాజకీయం చేస్తున్నాని అనడం దారుణమని అన్నారు. అందుకే తెదేపా విసిరిన సవాల్ ను స్వీకరించి విచారణకు వచ్చానని వ్యాఖ్యానించారు.
ఈ మధ్య కాలంలో వైకాపాకు రసపుత్ర రజిని….దొంగనోట్ల చలామణీ వ్యవహారంలో కటకటాలపాలయ్యారు. అయితే దాని వెనుక తన హస్తం ఉందని ఆరోపించడం అన్యాయమన్నారు. ఆమెను ఎప్పుడో పార్టీ నుంచి, పదవి నుంచి తొలగించామని అన్నారు. ఆమెతో ఎప్పుడో ఫోటో దిగినంత మాత్రాన…నేను కూడా అదే వ్యాపారం చేస్తున్నానని చెప్పడం ఘోరమన్నారు.
నాయకులతో ఎంతో మంది ఫోటోలు దిగుతారని… అంతమాత్రాన సంబంధం ఉన్నట్టేనా అని ప్రశ్నించారు. ఎంత విష ప్రచారం చేసినా తెదేపా అధికారంలోకి రావడం ఎప్పటికీ జరగదని అన్నారు. లోకేశ్ చేసిన అసత్యప్రచారాలకు…..కోర్టులో పరువు నష్టం దావా వేస్తానని అన్నారు.