TALASANI: హైదరాబాద్ లోని యూసఫ్‌గూడలో సీఎం కేసీఆర్ జన్మదిన వేడుకల్లో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పాల్గొన్నారు. కోట్ల విజయభాస్కర్ రెడ్డి స్టేడియంలో తెలంగాణ టీవీ, డిజిటల్ మీడియా టెక్నీషియన్స్ ఆధ్వర్యంలో వేడుకలు జరిగాయి.
ప్రజల శ్రేయస్సే ధ్యేయంగా కేసీఆర్ ప్రభుత్వం పనిచేస్తోందని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. ఈ సందర్భంగా ప్రత్యేకంగా రూపొందించిన పాటను తలసాని విడుదల చేశారు. అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన వైద్య శిబిరాన్ని ప్రారంభించారు.
తెలంగాణ రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసి దేశానికే ఆదర్శంగా కేసీఆర్ నిలిపారని మంత్రి అన్నారు. చలనచిత్ర, టీవీ పరిశ్రమల్లో లక్షలాది మంది బతుకుతున్నారని అన్నారు. ఒకప్పుడు చలనచిత్ర రంగం మద్రాసే గుర్తుకు వచ్చేంది. కానీ ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రం….. చలనచిత్ర రంగానికే చిరునామాగా మారింది. చలనచిత్ర పరిశ్రమ, టీవీ ఫెడరేషన్‌లో ఉండే ఆర్టిస్ట్‌లు, టెక్నీషియన్స్‌లలో అర్హులైన వారికి కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాలు అందిస్తున్నట్లు తెలిపారు.
ప్రభుత్వం అన్ని వర్గాల వారికి చేయూత అందిస్తోందని మంత్రి తలసాని అన్నారు.సంక్షేమం, పరిపాలనలో దేశానికే ఆదర్శంగా నిలిచారని తెలిపారు. అంతేకాకుండా జాతీయస్థాయిలోనూ పాగా వేస్తామని వ్యాఖ్యానించారు. దేశ ప్రజలు కేసీఆర్ పాలనకే మొగ్గుచుపుతున్నారని పేర్కొన్నారు. కచ్చితంగా దేశాన్ని కేసీఆర్ శాసిస్తారని అన్నారు. నిన్న కూడా ఇదే అంశంపై మాట్లాడారు. తమకు ఎవరితోనూ పొత్తు ఉండదని అన్నారు. ఎప్పటికీ భారాస ప్రభుత్వం అధికారంలో ఉంటుందని తెలిపారు.