KANNA: భాజపాకు ఆ పార్టీ రాష్ట్ర మాజీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీ నారాయణ రాజీనామా చేశారు. సోము వీర్రాజు ప్రవర్తన వల్లే భాజపాను వదిలి పెట్టాల్సి వచ్చిందని కన్నా లక్ష్మీనారాయణ అన్నారు. తన రాజీనామా లేఖను పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాకు పంపించారు.
గుంటూరులో తన అనుచరులతో సమావేశమైన కన్నా…..భవిష్యత్ కార్యచరణపై సమాలోచనలు చేశారు. రాష్ట్ర భాజపాలో జరుగుతున్న పరిణామాలు సవ్యంగా లేవని….తనను కలచి వేశాయని అన్నారు. సోము వీర్రాజు భాజపా రాష్ట్ర అధ్యక్షుడయ్యాక పరిస్థితులు దిగజారాయని దుయ్యబట్టారు.
సోమువీర్రాజు వైఖరి వల్లే పార్టీని వీడుతున్నట్లు తెలిపారు. పార్టీలో కక్ష సాధింపు చర్యలు ఎక్కువయ్యాయని అన్నారు. రాష్ట్రంలో భాజపాలో జరుగుతున్న చర్యలను ఆ పార్టీ సీనియర్ నేతగా చూడలేకపోయాను. పార్టీలో ఇమడలేకపోయాయని అన్నారు. పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేసినట్లు తెలిపారు. భవిష్యత్ కార్యాచరణ గురించి త్వరలో ప్రకటిస్తానని తెలిపారు.
అయితే కొన్నిరోజులుగా భాజపాలో కన్నా లక్ష్మీనారాయణ అసంతృప్తితో ఉన్నట్లు తెలుస్తోంది. ఇదే నేపథ్యంలో సోము వీర్రాజుపైనా వ్యాఖ్యలు చేశారు. సోము వీర్రాజు వల్లే పార్టీ ఎదగడం లేదని విమర్శించారు. తన వర్గానికి, అనుచరులకు పార్టీలో సరైన గుర్తింపు ఇవ్వడం లేదని గతంలోనూ వాపోయారు. సోమువీర్రాజు అధ్యక్షుడయ్యాక పార్టీ తీరుతెన్నులు, పరిస్థితులు పూర్తిగా మారిపోయాయని అన్నారు.
ఇక కన్నా….ఏ పార్టీలో చేరతారన్నది చర్చనీయాంశంగా మారింది. ప్రత్యమ్నాయ పార్టీలుగా జనసేన, తెదేపా ఉండనే ఉంది. తనకు మోదీ నాయకత్వం పట్ల గౌరవం ఉందని…రాష్ట్ర నాయకత్వమే సరిగ్గా లేదని అన్నారు. చివరకు జీవీఎల్ నరసింహంపైనా విమర్శలు గుప్పించారు. ఆయన పార్టీతో సంబంధం లేకుండా ఇష్టానుసారం ప్రవర్తిస్తున్నారని మండిపడ్డారు. నేను పదవుల్లో కూర్చుబెట్టిన వారినీ సోమువీర్రాజు తీసేశారని అన్నారు. అయితే గతంలో జనసేనలోకి వెళ్తారని…మరోసారి తెదేపాలోకి వెళ్తారని ఊహాగానాలు గుప్పుమన్నాయి. కానీ ఆయన మాత్రం ఇంకా దేనిపైనా స్పష్టత ఇవ్వలేదు