chelluboyina: ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నేతృత్వంలో ఏపీ పారిశ్రామికంగా పరుగులు పెడుతోందని బీసీ సంక్షేమ శాఖా మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ వ్యాఖ్యానించారు. ఆంధ్రప్రదేశ్ ను ముఖ్యమంత్రి జగన్ మొదటి స్థానంలో ఉంచారని అన్నారు. సంక్షేమం, అభివృద్ధిని రెండు కళ్లు లాగా చూస్తున్నారని మంత్రి పునరుద్ఘాటించారు.
ఎమ్ ఎస్ ఎంఈలకు మార్కెట్లో విస్తృత ప్రాధాన్యత కల్పించిన ప్రభుత్వం వైకాపా ప్రభుత్వమని మంత్రి అన్నారు. కరోనా కష్ట కాలంలో ఆర్థిక సంక్షోభం నుంచి ఎమ్ఎస్ఎంఈలను బయటకు తెచ్చేందుకు రిస్టార్ట్ ప్యాకేజీ పొడిగించారని గుర్తు చేశారు. భావితరాల బాగు కోసం ముఖ్యమంత్రి జగన్ పదే పదే చెబుతుంటారని అన్నారు. ఆంధ్రప్రదేశ్లో పేదరికాన్ని రూపుమాపేందుకు ఒక లక్ష 92 వేల కోట్ల రూపాయలకు పైనే సంక్షేమానికి అందించారని వ్యాఖ్యానించారు.
పరిపాలన సంస్కరణల్లో ఆంధ్రప్రదేశ్ దేశానికే ఆదర్శంగా నిలిచిందని పునరుద్ఘాటించారు. అమూల్ వచ్చాక పాలధర విపరీతంగా పెరిగిందని అన్నారు. దానివల్ల రైతుని ఎక్కడా నష్టానికి గురికాకుండా ముఖ్యమంత్రి చర్యలు చేపట్టారని అన్నారు.
ప్రజలు అవకాశం ఇచ్చారు కాబట్టి మంచి పరిపాలన అందించాలనేది జగన్ లక్ష్యం, ఏదో ఒక విధంగా అవాస్తవాలు ప్రచారం చేసైనా సరే పరిపాలించాలనేది చంద్రబాబు సిద్ధాంతం. ఇద్దరికీ ఎంత వ్యత్యాసం ఉందో ప్రజలు గమనించాలని మంత్రి చెల్లుబోయిన అన్నారు.
రైతులను ఆదుకోవడానికి ఆర్బీకేలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. రైతులకు అన్యాయం జరగకుండా చర్యలు చేపట్టారని గుర్తుచేశారు. రాష్ట్రం విడిపోయే సమయంలో ఆంధ్రప్రదేశ్ కు ఏం కావాలో చంద్రబాబు చెప్పారా అని ప్రశ్నించారు. అనువైన ప్రాంతాన్ని రాజధానిగా ఎంపిక చేయలేకపోయారని దుయ్యబట్టారు. 40 ఏళ్ల అనుభవం ఉండి కూడా రాష్ట్రంలో సత్తా చాటలేకపోయారని వ్యాఖ్యానించారు.