CM JAGAN: రాష్ట్రంలో పరిశ్రమల అభివృద్ధికి ప్రభుత్వం ఎల్లప్పుడూ సాకారం అందిస్తుందని ముఖ్యమంత్రి జగన్ అన్నారు. జమ్మలమడుగు మండలం సున్నపురాళ్లపల్లెలో స్టీల్ ప్లాంట్ నిర్మాణానికి ముఖ్యమంత్రి భూమిపూజ చేశారు.
ఎన్నికల కోడ్ ఉన్నందున ఎక్కువమందిని ఈ కార్యక్రమానికి పిలవలేకపోయామని అన్నారు. ఎన్నికల అధికారుల ఆంక్షలకు అనుగుణంగా నడుచుకోవాలని అన్నారు. దేవుడి ఆశీర్వాదంతో వైఎస్ ఆర్ కడప జిల్లాలో మంచి కార్యక్రమానికి పునాది వేశామని సీఎం జగన్ అన్నారు.
ఎన్నో ఎళ్ల కల ఈ స్టీల్ ప్లాంట్ అని ముఖ్యమంత్రి తెలిపారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి మరణంతో ఈ ప్రాంతాన్ని ఎవరూ పట్టించుకోలేదని గుర్తు చేశారు.
2 దశల్లో కట్టడానికి సజ్జన్ జిందాల్ ప్రణాళిక తయారు చేశారు. మొదటి దశ 24 నుంచి 30 నెలల్లో ఈ ప్రాజెక్టు పూర్తి అవుతుందని అన్నారు. 2 దశ నిర్మాణం 5 ఏళ్లలో పూర్తి అవుతుందని అన్నారు. మొత్తంగా 8,800 కోట్ల రూపాయలతో ప్రాంతంలో 3 మిలియన్ టన్నుల స్టీల్ ఉత్పత్తి అవుతుందని ముఖ్యమంత్రి తెలిపారు.
ఒక మంచి వ్యక్తి చేతుల్లోకి స్టీల్ ప్లాంట్ నిర్మాణం వెళ్తుందని అన్నారు. ఈ ప్రాంతంలో ప్లాంట్ నిర్మాణానికి చాలా కష్టపడాల్సి వచ్చింది. అయినప్పటికీ దేవుడిదయతో సాధ్యమైంది. స్టీల్ ప్లాంట్ నిర్మాణానికి 3,500 ఎకరాలు సజ్జన్ జిందాల్ కంపెనీకి ఇచ్చామని అన్నారు. స్టీల్ ప్లాంట్ వస్తే స్టీల్ సిటీగా ఏర్పడుతుందని ముఖ్యమంత్రి అన్నారు. స్టీల్ ప్లాంట్ అభివృద్ధితో జిల్లా మరింత అభివృద్ధి పడుతుందని వ్యాఖ్యానించారు. దాదాపు 700 కోట్ల రుపాయలతో మౌలిక వసతులు కల్పిస్తున్నట్లు తెలిపారు.
గండికోట రిజర్వాయర్ ద్వారా నీటి సరఫరా జరుగుతుందని తెలిపారు. మొత్తం 30 లక్షల టన్నుల సామర్థ్యంతో స్టీల్ ప్లాంట్ ఏర్పాటు చేస్తున్నట్లు ముఖ్యమంత్రి జగన్ తెలిపారు.