మంచి యవన వయసులో వచ్చే సాధారణ సమస్య మొటిమలు . పన్నెండు శాతం మహిళలను నాలుగుపదుల దశలోనూ ఇబ్బంది పెడుతుంది. పురుషులూ ఇందుకు మినహాయింపు కాదు. మొహం మీద ఎక్కువగా కనిపించినా.. ఛాతీ, వీపు, భుజాలపైనా మొటిమలు వస్తాయి. మరీ ప్రమాదకరం కాకపోవచ్చు కానీ.. కౌమార బాలికల ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీస్తాయివి. నిర్లక్ష్యం చేస్తే శాశ్వత మచ్చల్లా మిగిలిపోతాయి.
కౌమారంలో హార్మోన్ల మార్పులు, ఒత్తిడి, బ్యాక్టీరియా, కాలుష్యం, జీన్స్.. ఇలా మొటిమలకు అనేక కారణాలు. చర్మ రంధ్రాలు నూనెతో, మృతకణాలతో నిండిపోవడంతో బ్యాక్టీరియా క్రిములు పోగై.. మహావేగంగా వృద్ధి చెందుతాయి. క్రమంగా ఆ ప్రాంతంలో వాపు వస్తుంది. కొన్నిసార్లు చీము పడుతుంది. కొంతకాలానికి ఆ మచ్చలు మాయమైపోయి చర్మం సాధారణ స్థితికి వచ్చేస్తుంది. కొందరి విషయంలో రుతుక్రమానికి ముందు మొటిమల తీవ్రత అధికం అవుతుంది. అరుదుగానే అయినా.. మార్కెట్‌లో దొరికే క్రీములు దుష్ప్రభావం చూపే ఆస్కారం ఉంది. ఇలాంటి సందర్భాల్లో వైద్య నిపుణులను సంప్రదించడం ఉత్తమం.
చికిత్సలో భాగంగా.. మొటిమల తాలూకు గాయాలు మానేందుకు చికిత్స ఇస్తారు. తర్వాత, ఆ మచ్చలు చర్మం రంగులో కలిసిపోయేందుకు చర్యలు తీసుకుంటారు. సాలిసిలిక్ యాసిడ్ లేదా బెంజాయిల్ పెరాక్సైడ్ ఉన్న ఫేస్‌వాష్ సిఫారసు చేస్తారు. సమస్య తీవ్రతను బట్టి యాంటీబయోటిక్స్ ఇస్తారు. మొండిమచ్చల విషయంలో లైట్ థెరపీ, లేజర్ థెరపీ తదితర విధానాలను ఎంచుకుంటారు. కాబట్టి, నిర్లక్ష్యం చేయకుండా నిపుణులను సంప్రదించడం ఉత్తమం.