KTR: ప్రధాని నరేంద్ర మోదీ పాలనలో దేశం గతి పూర్తిగా దిగజారిపోయిందని ఐటీ మంత్రి కేటీఆర్ ఆక్షేపించారు. అసెంబ్లీ వేదికగా ప్రధానిపై విరుచుకుపడ్డారు.
మోదీ పాలనలో భారతదేశం అన్నిరంగాల్లోనూ ఎగబాకిందని ఎద్దేవా చేశారు. ఎన్నడూ లేనంత అత్యధిక ద్రవ్యోల్బణం….మన దేశంలోనే నమోదయిందని అన్నారు. ద్రవ్యోల్బణంతోపాటు నిరుద్యోగం పతాక స్థాయికి చేరిందని విమర్శించారు.
ప్రపంచంలోనే అత్యధిక సిలెండర్ ధర మన దేశంలోనే ఉందని దుయ్యబట్టారు. 4వందల రూపాయల ఉన్న సిలిండర్ ధరను 12వందలకు పెంచారని మండిపడ్డారు. ఎక్కువ పెట్రోలు ధర కలిగిన మూడో దేశంగా భారత దేశం ఖ్యాతి గడించిందని ఎద్దేవా చేశారు. ఇవే కాకుండా అమలుకానీ హామీలు మరెన్నో ఉన్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు.
రైతులకు ప్రయోజనం కలిగే కాళేశ్వరం కడితే…..దానిపైనా విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. లక్షా పదివేల కోట్లు పెట్టి అహ్మదాబాద్ నుంచి ముంబయికి బుల్లెట్ రైలు వేసినప్పుడు లేని తప్పు…. ప్రాజెక్టు కడితే తప్పా అని నిలదీశారు. అంత ఖర్చు పెట్టి బుల్లెట్ రైలు అవసరమా అని ప్రతిపక్షాలు ప్రశ్నిస్తే…. బుల్లెట్ రైలు వద్దనుకున్నవాళ్లు ఎడ్లబండిపై తిరగండని మోదీ హేళన చేసిన విషయాన్ని కేటీఆర్ గుర్తు చేశారు.
గూగుల్ సెర్చ్ చేస్తే 2018లో మోదీ ఇచ్చిన హామీలు దొరుకుతాయని అసెంబ్లీలో అన్నారు. 2022 నాటికి రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేస్తామని చెప్పారని అన్నారు. ప్రతి పౌరుడికి సొంత ఇల్లు, దేశమంతా బుల్లెట్ రైళ్లు పరుగెడతాయని…. ప్రతి ఇంటికి విద్యుత్ ఇస్తామన్న హామీ ఏమైందని ప్రశ్నించారు.
2022 కల్లా దేశ ఆదాయాన్ని ఐదు ట్రిలియన్ డాలర్లు చేస్తామని, బారతదేశం నుంచి అంతరిక్షంలో అస్ట్రోనాట్లను పంపుతామని మోదీ ఇచ్చిన హామీలు ఏమయ్యాయని ప్రశ్నించారు.