ప్రముఖ నేపథ్య గాయని వాణీ జయరాం (78) ఇకలేరు. నుదురుకు గాయమై గత కొంతకాలంగా చికిత్స తీసుకుంటున్న ఆమె ఇవాళ తమిళనాడు రాజధాని చెన్నై నగరంలోని నుంగమ్‌బక్కమ్‌లోగల హడ్డోస్ రోడ్డులోని తన నివాసంలో తుదిశ్వాస విడిచారు. ఈ విషయాన్ని కుటుంబసభ్యులు మీడియాకు తెలిపారు. వాణీ జయరాం అసలు పేరు కలైవాణి. తెలుగు, తమిళ, మలయాళ, హిందీ, గుజరాతీ, మరాఠీ, ఒరియా, భోజ్‌పురి ఇలా మొత్తం 19 భాషల్లో 20 వేలకు పైగా పాటలను ఆమె ఆలపించారు.
ఆమె సేవలకు గుర్తింపుగా ఉత్తమ నేపథ్య గాయని విభాగంలో మూడుసార్లు నేషనల్ ఫిల్మ్ అవార్డు అందుకున్నారు. అంతేగాక, తమిళనాడు, మహారాష్ట్ర, కేరళ, గుజరాత్, ఒడిశా తదితర రాష్ట్రాలు కూడా ఆమెను అవార్డులతో సత్కరించాయి. ఇటీవల కేంద్ర ప్రభుత్వం కూడా వాణీ జయరాంకు పద్మభూషణ్ అవార్డును ప్రకటించింది.
తమిళనాడులోని వెల్లూరులో 1945 నవంబర్ 30న వాణీ జయరాం జన్మించారు. ఆరుగురు అక్కాచెల్లెళ్లలో ఐదో సంతానమై ఆమె 1971లో గాయనిగా సినీరంగ ప్రవేశం చేశారు.