GOVERNOR: తెలంగాణ….యావత్ దేశానికి ఆదర్శంగా నిలుస్తోందని గవర్నర్ తమిళిసై కొనియాడారు. అన్ని రంగాల్లోనూ దేశం ఆశ్చర్యపోయేలా తెలంగాణ అభివృద్ధి, గొప్ప ప్రగతిని సాధిస్తోందని అన్నారు.
ప్రజల ఆశీస్సులు, సీఎం కేసీఆర్ పరిపాలన వల్ల తెలంగాణ మంచి పురోగతి సాధించిందని అన్నారు. ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ తమిళిసై ప్రసంగించారు.
ఒకప్పుడు విద్యుత్ కోతలతో తెలంగాణ చీకటిలో గడిపేది. నేడు ప్రభుత్వ కృషితో 24 గంటల విద్యుత్ సరఫరాతో కోటి కాంతుల రాష్ట్రంగా విరాజిల్లుతోదని కొనియాడారు.
వ్యవసాయం కుదేలై విలవిలలాడిన నేల.. నేడు దేశానికే అన్నం పెట్టే ధాన్యాగారంగా అవతరించిందని పేర్కొన్నారు. తాగునీటి కోసం పరితపించే పరిస్థితి నుంచి బయటపడి ఇంటింటికీ ఉచితంగా అందిస్తోందని వెల్లడించారు.
తెలంగాణ గ్రామాల రూపురేఖలు మారి అత్యున్నత జీవన ప్రమాణాలతో ఆదర్శవంతంగా తయారయ్యిందని తెలిపారు.
పెట్టుబడులకు స్వర్గధామంగా, ప్రపంచ స్థాయి సంస్థలకు గమ్యస్థానంగా, ఐటీ రంగంలో మేటి రాష్ట్రంగా ప్రగతిపథంలో పరుగులు పెడుతోందని అభిప్రాయపడ్డారు. పర్యావరణ పరిరక్షణలోనూ, పచ్చదనం పెంపుదలలోనూ ప్రపంచవ్యాప్తంగా ప్రశంసలు అందుకుంటోందని చెప్పారు.
రూ.లక్షా 24 వేలుగా ఉన్న రాష్ట్ర తలసరి ఆదాయం.. నేటికి 3.17 లక్షల రూపాయలకు చేరిందని వెల్లడించారు. తెలంగాణ ఏర్పడ్డాక అభివృద్ధి రెట్టింపుస్థాయిలో జరిగిందన్నారు.