తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన ప్రముఖ సీనియర్ దర్శకుడు వి.సాగర్ (71) గురువారం ఉదయం చెన్నైలో కన్నుమూశారు. టి.నగర్ రాధాకృష్ణన్ వీధిలోని తన స్వగృహంలో నివశిస్తున్న సాగర్.. పదిరోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఆయన భౌతికకాయానికి శుక్రవారంఉదయం అంత్యక్రియలు నిర్వహిస్తారు.
సాగర్‌కు భార్య మాలా, ఇద్దరు కుమారులు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. సాగర్ పూర్తి పేరు ఉయ్యూరు విద్యా సాగర్ రెడ్డి. సినీ దర్శకుడిగా మారిన తర్వాత ఆయన వి.సాగర్‌గా ఖ్యాతిగడించారు. 1952లో గుంటూరు జిల్లా నంబూరులో జన్మించిన సాగర్.. విద్యాభ్యాసం చేసింది చెన్నైలోనే. తన సినీ కెరీర్‌ను తొలుత ఎడిటర్‌గా ప్రారంభించారు. సినిమా ఎడిటింగ్‌లో మంచి నైపుణ్యం కలిగిన టెక్నీషియన్‌గా గుర్తింపు పొందారు. 1983లో దర్శకుడిగా మారారు. హీరో నరేశ్ – విజయశాంతి జంటగా నటించిన ‘రాకాసి లోయ’ చిత్రం ద్వారా దర్శకుడిగా పరిచయమయ్యారు.
ఆ తర్వాత ‘పబ్లిక్ రౌడీ’, ‘దాడి’, ‘నక్షత్రపోరాటం’, ‘అమ్మదొంగ’, ‘భరతసింహం’, ‘ఆలుమగలు’, ‘జగదేకవీరుడు’, ‘ఖైదీ బ్రదర్స్’, ‘స్టువర్ట్‌పురం దొంగలు’, ‘రామసక్కనోడు’, ‘యాక్షన్ నెం.1’, ‘అన్వేషణ’, ‘ఓసి నా మరదలా’ వంటి 30కి పైగా చిత్రాలకు దర్శకత్వం వహించారు. అలాగే, సాగర్ ఫిల్మ్స్ బ్యానరును స్థాపించి సొంతంగా కూడా చిత్రాలు నిర్మించారు. సూపర్ స్టార్ కృష్ణ, భానుచందర్, సుమన్, అరుణ్ పాండ్యన్, వినోద్ తదితర హీరోలతో యాక్షన్ చిత్రాలను తెరకెక్కించారు. పదేళ్ళుగా చిత్ర పరిశ్రమకు దూరంగా ఉన్నారు. చెన్నైలోని వ్యాపారాలు చూసుకున్నారు. తెలుగు చిత్రపరిశ్రమలో దర్శకులుగా కొనసాగుతున్న శ్రీనువైట్ల, వి.వి.వినాయక్, రవికుమార్ చౌదరి, జి.నాగేశ్వర్ రెడ్డి తదితరులు సాగర్ వద్ద అసిస్టెంట్లుగా పనిచేసినవారే. ఈయన తెలుగు సినీదర్శకుల సంఘానికి మూడుసార్లు అధ్యక్షుడిగా కూడా పనిచేశారు.