PHONE TAPPING: ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డిపై వైకాపా నేతలు భగ్గుమంటున్నారు. కోటంరెడ్డి కావాలనే పార్టీపై బురద జల్లుతున్నారని దుయ్యబట్టారు. ఫోన్ ట్యాపింగ్ జరిగితే ముందే చెప్పాలి గానీ…..ఇప్పుడు ఇలా బహిరంగంగా ఆరోపణలు చేయడం ఎంత వరకు సమంజసమో చెప్పాలని ప్రశ్నించారు. ఫోన్ ట్యాపింగ్ చేయడమే ప్రభుత్వ పనా? అని ప్రశ్నించారు.
కోటంరెడ్డిపై ఆ పార్టీకి చెందిన మంత్రి గుడివాడ అమర్‌నాథ్, పేర్ని నాని, కొడాలి నాని తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. కోటంరెడ్డి ఒకవేళ వైఎస్ కుటుంబానికి విధేయుడైతే పార్టీ మారడం దేనికని పేర్ని నాని ప్రశ్నించారు.
కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఫోన్ ట్యాప్ చేయాల్సిన ఖర్మ ఎవరికీ లేదని కొడాలి నాని విమర్శించారు. పార్టీ మారాలనుకున్నారు కాబట్టే వక్రబుద్ధితో ఆరోపణలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. తెలుగుదేశంలోకి వెళ్లేందుకు ఇన్ని నాటకాలు ఆడుతున్నారని మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఇద్దరు వ్యక్తులు మాట్లాడుతుండగా మూడో వ్యక్తి రికార్డు చేస్తే దానిని ట్యాపింగ్ అంటారు. ఇద్దరు వ్యక్తుల సంభాషణ బయటకు వస్తే ఎవరో ఒకరు రికార్డు చేసినట్లు. అంతే గానీ ఫోన్ రికార్డింగ్‌ను పట్టుకుని ట్యాపింగ్ అంటూ ప్రభుత్వంపై విరుచుకుపడటం సబబు కాదని మంత్రి గుడివాడ అమర్నాథ్ వ్యాఖ్యానించారు.