BUDGET: తెలంగాణ రాష్ట్ర బడ్జెట్ సమావేశాలు ఫిబ్రవరి 3న ప్రారంభం కానున్నాయి. సమావేశాల తొలిరోజు గవర్నర్ తమిళిసై ఉభయ సభలను ఉద్దేశించి మాట్లాడనున్నారు. శాసన మండలి, శాసనసభల సమావేశానికి గవర్నర్ అనుమతి ఇచ్చారు. బడ్జెట్ సమర్పణ పత్రాలపై గవర్నర్ సంతకం చేశారు. హైకోర్టు సూచనలతో ప్రభుత్వం, రాజ్‌భవన్ లాయర్ల మధ్య నిన్న సంధి కుదిరింది. హైకోర్టులో దాఖలైన పిటిషన్ విషయంలో ప్రభుత్వం, రాజ్‌భవన్ లాయర్ల మధ్య జరిగిన చర్చలు సఫలం అయ్యాయి.
సమావేశాల్లో గవర్నర్ ప్రసంగానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని ప్రభుత్వ తరపు న్యాయవాది దుష్యంత్ దవే చెప్పారు. దీంతో బడ్జెట్ సమావేశాలపై స్పష్టత వచ్చింది. ముఖ్యమంత్రి ఆదేశాలతో మంత్రి ప్రశాంత్ రెడ్డి, రాష్ట్ర ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి, అసెంబ్లీ కార్యదర్శి…… నిన్న సాయంత్రం రాజ్‌భవన్లో గవర్నర్ తమిళిసైను మర్యాదపూర్వకంగా కలిశారు. మంత్రి, అధికారుల బృందం గవర్నర్ భేటీ తరువాత బడ్జెట్ సమావేశాలపై ఉన్న తెర వీడింది.
ఫిబ్రవరి 3న బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఆ రోజు ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ ప్రసంగిస్తారు. ఆ తరువాత రెండు, మూడు రోజుల్లో బడ్జెట్‌ను ఆర్థిక మంత్రి ప్రవేశపెడతారు. ఇందుకు సంబంధించిన బడ్జెట్ సమర్పణ పత్రాలపై గవర్నర్ సంతకం చేశారు.
శాసనసభల్లో వార్షిక బడ్జెట్ ప్రవేశపెట్టేందుకు గవర్నర్ అనుమతి ఇవ్వకపోవడంపై నెలకొన్న వివాదం…..చివరకు హైకోర్టు వేదికగా సమస్య పరిష్కారమైంది. రాజ్యాంగ నిబంధనల ప్రకారం గవర్నర్ అనుమతి ఇస్తారని రాజ్‌భవన్ తరఫు న్యాయవాది హైకోర్టుకు హామీ ఇవ్వడంతో……పిటిషన్‌పై విచారణ ముగించాలని ప్రభుత్వ అభ్యర్థనను హైకోర్టు ఆమోదించింది.