తెలంగాణ రాష్ట్ర బడ్జెట్ సమావేశాలు ఫిబ్రవరి 3వ తేదీ నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ సందర్భంగా బడ్జెట్ సమావేశాలపై సీఎం కేసీఆర్ సమాలోచనలు జరుపుతున్నారు.
ఈ సమావేశానికి ఆర్థిక మంత్రి హరీశ్‌రావు, శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి ప్రశాంత్ రెడ్డితో పాటు పలువురు అధికారులు హాజరయ్యారు. గవర్నర్ ప్రసంగంతో పాటు బడ్జెట్ సమావేశాల తేదీలను కేసీఆర్ ఖరారు చేయనున్నారు.
3వ తేదీన మధ్యాహ్నం 12:10 గంటలకు శాసనసభ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. శాసనసభ ప్రారంభం రోజే బడ్జెట్ ప్రవేశపెట్టే అవకాశం ఉంది. తెలంగాణ రాష్ట్ర బడ్జెట్ 2023-24 ప్రతిపాదనలపై ముఖ్యమంత్రి కేసీఆర్ ఇటీవలే సమీక్ష నిర్వహించిన సంగతి తెలిసిందే. 2023-24 ఆర్థిక సంవత్సరంలో రాష్ట్ర బడ్జెట్ రూ.2.85 లక్షల కోట్ల నుంచి రూ.3 లక్షల కోట్ల వరకు ఉండొచ్చని ఆర్థిక వర్గాలు అంచనా వేస్తున్నట్టు విశ్వసనీయంగా తెలిసింది.