దేశంలో ఆయా ప్రభుత్వాలు, నేతలు మారడం కాదని.. ప్రజల బతుకులు మారాలని అసెంబ్లీ స్పీకర్ పోచారం శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. మహాత్మా గాంధీ వర్ధంతి సందర్భంగా శాసనసభ ఆవరణలోని మహాత్ముడి విగ్రహానికి మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డితో కలిసి పూలమాలలు వేసి, నివాళులర్పించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సృష్టి ఉన్నంత వరకు మహాత్ముడు అందరికీ గుర్తుటారన్నారు. శాంతి, సామరస్యంతో దేశానికి స్వాతంత్య్రం తీసుకువచ్చారన్నారు.
అంతటి మహానీయుడు హత్యకు గురికావడం దేశానికి దురదృష్టకరమన్నారు. వర్ధంతి సందర్భంగా గుర్తు చేసుకోవడంతో పాటు ఆయన ఆలోచన విధానాన్ని ఆచరణలో పెట్టాలన్నారు. దేశం సంపన్నమైందని, దేశంలో ప్రకృతి వనరులకు మానవ వనరులను జోడిస్తే అద్భుతాలు సృష్టించవచ్చన్నారు. గాంధీ కలలుగన్న గ్రామ స్వరాజ్యం రావాలన్న ఆయన.. సీఎం కేసీఆర్ పాలన గ్రామాల్లో ప్రజలకు అవసరమైన సదుపాయాలు కల్పిస్తున్నారన్నారు.
ప్రస్తుతం బతుకుదెరువు కోసం పట్నాలకు వెళ్లిన వారంతా తిరిగి పల్లెలకు చేరుకుంటున్నారన్నారు. తెలంగాణ రాష్ట్రంలో రివర్స్ వలసలు మొదలయ్యాయని, గ్రామాల్లో కులవృత్తులకు పూర్వవైభవం వచ్చిందన్నారు. నేడు గ్రామాలు ఎంతో బాగున్నాయన్న స్పీకర్.. తన 47 సంవత్సరాల రాజకీయ అనుభవంతో చెబుతున్నానన్నారు. తాగునీరు, కరెంటు తదితర సమస్యలు లేవని, కేంద్రం కొన్ని అంశాలలో వ్యతిరేకించినా తెలంగాణ అభివృద్ధిలో ముందంజలో ఉందన్నారు.
కేంద్రం ప్రకటించిన ఉత్తమ గ్రామ పంచాయతీ అవార్డుల్లో 20కి 19 తెలంగాణ పల్లెలే ఎంపికయ్యారన్నారు. దేశంలో రూ.2,78,000 తలసరి ఆదాయంతో తెలంగాణ రాష్ట్రం అగ్రస్థానంలో ఉందన్నారు. మహాత్మాగాంధీ గారి ఆలోచనలు అమలులో ఉండి స్వాతంత్ర్య ఫలాలు అందరికీ అందాలని, అందుకు మనమందరం పునరంకితం కావాలన్నారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీలు లెజిస్లేటివ్ సెక్రెటరీ వీ నరసింహాచార్యులు, అధికారులు పాల్గొన్నారు.